Ponguleti Srinivasa Reddy Vs Bhatti Vikramarka: తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ.. తర్వలో జరగనున్న లోక్ సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. మొత్తం 17 స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉన్న జోష్ నే లోక్ సభ ఎన్నికల్లో కంటిన్యూ చేయాలని చూస్తోంది. గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 13 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ (Congress) హైకమాండ్.. మిగతా మూడు స్థానాలపై ఫోకస్ చేస్తోంది.
ఖమ్మం ఎంపీ టికెట్.. మంత్రుల మధ్య వార్.
లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) విజయం వైపు అడుగులు వెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ (Khammam MP Ticket) తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో భట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.
సోషల్ మీడియా వేదికగా..
పొంగులేటిపై సోషల్ మీడియాలో భట్టి అనుచరుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మల్లు నందినికి టికెట్ రాకుండా మంత్రి పొంగులేటి అడ్డుపడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మల్లు నందిని రాజకీయ భవితవ్యంపై కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు. పార్టీని కబ్జా చేస్తే ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం టికెట్ పొంగులేటి ప్రసాద్‌రెడ్డికి ఇస్తే బీఆర్ఎస్‌కు జరిగిన నష్టమే కాంగ్రెస్‌కి జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
మల్లు నందినికి చెక్ పెట్టేందుకు సోనియా, రాహుల్, ప్రియాంక పేర్లను వాడుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎంపీ అభ్యర్థిత్వం విషయంలో మరింత జాప్యం చేస్తే నష్టం జరుగుతుందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.