Nama Nageswara Rao : ఇప్పటికి 16 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR) కు మరో షాక్ తగిలేలా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) కి ఎంపీ నామా నాగేశ్వర్‌రావు(Nama Nageswara Rao) రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపు లేదా ఎల్లుండి బీజేపీ(BJP) లో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. నామా నాగేశ్వర్‌రావు కు ఇప్పటికే సీటు కేటాయిచింది బీఆర్‌ఎస్. ఖమ్మం(Khammam) బరిలో బలమైన అభ్యర్థి కోసం నామాకు బీజేపీ గాలం వేస్తోంది. ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశించి ఇటీవల ఆ పార్టీలో చేరారు జలగం వెంకట్రావ్. మొదట సీటు జలగం వెంకట్రావ్‌కే కేటాయిస్తారని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జోరుగా సాగింది. నామా వైపే బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరివెనుక ఒకరు పార్టీని బీఆర్ఎస్ నేతలు వీడుతున్నారు.
అలిగిన జిట్టా..
మాజీ సీఎం కేసీఆర్ పై అలిగారు జిట్టా బాలకృష్ణారెడ్డి(Jitta Balakrishna Reddy). భువనగిరి టికెట్ రాకపోవడంతో సైలెంట్ అయ్యారు. క్యామ మల్లేశంకు ఎంపీ టికెట్ ను బీఆర్‌ఎస్ కేటాయించింది. కేసీఆర్ మరోసారి తనను మోసం చేశారని జిట్టా మండిపడుతున్నారు. భువనగిరి టికెట్ ఇస్తామని మరోసారి హ్యాండిచ్చారని తన అనుచరులతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. రెండు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తన అనుచరులతో జిట్టా వెల్లడించినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ జిట్టా.. ఇప్పుడు పార్లమెంట్ టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి జిట్టా పార్టీ మారుతారా? లేదా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా? అనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.