RS Praveen Kumar: నన్ను దయచేసి నమ్మండి.. అందుకే బీఆర్ఎస్ లో చేరిన... ఆర్‌ఎస్ ప్రవీణ్ సంచలన ట్వీట్

బీఆర్ఎస్ పార్టీలో చేరడంపై వివరణ ఇచ్చారు ఆర్‌ఎస్ ప్రవీణ్. దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, బీజేపీ చేస్తున్న కుట్రల నుంచి దేశాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు.

New Update
RS Praveen Kumar : వారిలా నేను గొర్రెను కాను.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర ట్వీట్..!

RS Praveen Kumar: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తన పేరును ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ నేపథ్యంలో తనపై నమ్మకం పెట్టుకొని.. తనకు టికెట్ ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బీఎస్పీ కి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో ఆర్‌ఎస్ ప్రవీణ్ చేరడంపై గత కొన్ని రోజులుగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మారడంపై ట్విట్టర్ (X) వేదికగా వివరణ ఇచ్చారు ఆర్‌ఎస్ ప్రవీణ్.

ALSO READ: కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టు కీలక నిర్ణయం?

ఆయన ట్విట్టర్ (X) లో.. "శ్రేయోభిలాషులకు ఒక ప్రార్థన🙏, నా రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్ములను బాధ పెట్టి ఉోండవచ్చు. నాకు కూడా బాధగానే ఉంది. ఒక ఉన్నతమైన లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవు. అయితే విషయాన్ని అర్థం చేసుకోకుండా, నా మీద సోషల్ మీడియా వేదికగా కొన్ని శక్తులు (కొంత మంది ఆప్తులతో సహా!) తీవ్రమైన దాడి చేసినయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి అనాగరికమైన దాడులు నాకు కొత్త కాదు. నన్ను, పేద ప్రజల జీవితాలను సమూలంగా మార్చాలన్న నా లక్ష్యం నుండి ఈ చిల్లర దాడులు దూరం చేయలేవు" అని అన్నారు.

"నన్ను దయచేసి నమ్మండి... నేను ఇన్నాళ్లూ నిస్వార్థంగా పీడిత ప్రజలకోసమే పనిచేశాను. చట్ట సభల్లో కూడా మీ గొంతుకగా ఉండాలనే లక్ష్యంతో ఎంతో విలువైన ఉద్యోగాన్ని సైతం వదలి రాజకీయాల్లోకి వచ్చాను. అసెంబ్లీలో బహుజనుల గొంతుకగా ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినా మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాను. తెలంగాణ వాదం -బహుజనవాదం రెండూ ఒకటేనని నమ్మి ఎంతో శ్రమించి శ్రీ కేసీఆర్ మరియు బెహన్జీ మాయావతి గార్లను ఒప్పించి తెలంగాణలో చారిత్రాత్మక పొత్తు ఏర్పాటయ్యేలా చూశాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది చివరి నిమిషంలో రద్దయినప్పటికీ, ఇచ్చిన మాట మేరకు విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో కోట్లాది బహుజనుల బంగారు భవిష్యత్తు కోసం, భారత రాజ్యాంగ విలువల రక్షణ కోసం, కేసీఆర్ గారితోనే కలసి ప్రయాణించాలనుకున్నాను. బీజేపీ కుట్రల నుండి దేశాన్ని రక్షించే ధమ్ము-ధైర్యం కాంగ్రేసుకు ముమ్మాటికీ లేదు. అందుకే నేను ఇటీవలే బీఆర్ఎస్ లో చేరాను." అని పేర్కొన్నారు.

"ఈ యుద్దంలో కేసీఆర్ గారి మార్గదర్శనంలో సర్వశక్తులొడ్డి విజయం కోసం పోరాడతాను. దయచేసి మీరు కూడా నాతో రండి. మీకు చేతనైన సాయం చేయండి. మీ విలువైన సమయమివ్వండి. నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి వచ్చి ‘కారు’ గుర్తుకు ఓటెయ్యమని ఇంటింటికి ప్రచారం చేయండి. లేదా మీకు తెలిసిన వారికందరికీ కనీసం ఫోన్ చేసయినా చెప్పండి. నేను చట్టసభల్లో కూర్చుంటే మీరందరూ అక్కడ కూర్చున్నట్లే… నేను నేను కాదు…నేను మీరే… మనమందరమూ… ఛలో నాగర్ కర్నూల్.. జైభీం…జై తెలంగాణ..జై భారత్' అంటూ రాసుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు