Election Commission : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) దగ్గరికొస్తున్నాయి. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంత వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఈసీ(Election Commission).. ఎన్నికలకు సంబంధించిన కసరత్తులు దాదాపు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించేందుకు గత కొన్నిరోజులుగా ఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో చర్చలు జరిపిన అధికారులు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 9వ తేదీ తర్వాత ఎన్నికల సంఘం.. ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్వసనీయ నుంచి సమాచారం అందింది.
Also Read : నారీ శక్తి అంటూ గొంతులు చించుకుంటారు కదా.. ఇక్కడ చూపించండి మరి!
జమ్మూ కశ్మీర్‌లో కూడా ఇప్పుడే ఎన్నికలు
దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌తో పాటు.. అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఆంధప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఈ రాష్ట్రాలతో పాటు ఈసారి జమ్మూ కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. మార్చి 8,9వ తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ బృందం సమావేశం కానున్నట్లు సమాచారం. జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు, బలగాలకు సంబంధించి కూడా ఇందులో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 12-13 తేదిల్లో ఈసీ.. జమ్ముకశ్మీర్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. అక్కడ కూడా లోక్‌సభతో సహా స్థానిక అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) కూడా నిర్వహించే దానిపై ఓ అంచనాకు రానుంది.
గతంలో లాగే ఈసారి కూడా
ఇదిలా ఉండగా.. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 10 న ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ను నిర్వహించారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. గతంలో లాగే ఈసారి కూడా ఏప్రిల్-మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. ఇక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత దేశంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లోకి వస్తుంది. రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. మూడోసారి కూడా అధికార పగ్గాలు చేపట్టాలనుకుంటోంది. ఇక మరోవైపు మోదీ సర్కార్‌ను గద్దె దించే లక్ష్యంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఈసారి దేశ ప్రజలు ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Also Read : ఫుల్లుగా మందేసిన చిరుత.. ఆడేసుకున్న జనాలు!