/rtv/media/media_files/2025/12/12/women-night-not-work-2025-12-12-17-29-15.jpg)
Astrology Tips
హిందూ ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో సమయాన్ని బట్టి పాటించాల్సిన ఆచారాలు, నిబంధనలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసే ప్రతి పని మన జీవితంపై, అదృష్టంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట, నిద్రపోయే ముందు కొన్ని పనులను చేయకూడదని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ పనులు చేయడం వలన ఇంట్లో ప్రతికూల శక్తి (Negative Energy)ప్రవేశించి.. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉందని పండితులు చెబుతున్నారు. మరి స్త్రీలు రాత్రిపూట తప్పనిసరిగా దూరంగా ఉండాల్సిన ఆ పనులు ఏంటో.. వాటి వెనుక ఉన్న మతపరమైన, శాస్త్రీయ కారణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
రాత్రిపూట స్త్రీలు చేయకూడని పనులు:
జుట్టు విరబోసుకుని పడుకోవడం:
స్త్రీలు రాత్రిపూట జుట్టు విరబోసుకుని (Sleeping with Open Hair) పడుకోవడం లేదా ఇంట్లో తిరగడం మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా పడుకునేటప్పుడు ఇలా చేయడం ప్రతికూల శక్తులను లేదా దుష్ట శక్తులను ఆకర్షిస్తుందని నమ్మకం. జుట్టు విరబోసుకుని పడుకోవడం వల్ల జుట్టు చిక్కుబడి, తెగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే నిద్రలో తలకు సరైన గాలి తగలక.. తల చుట్టూ వేడి పెరిగి నిద్రకు భంగం కలుగుతుంది. జుట్టును వదులుగా జడ వేసుకోవడం లేదా ముడి వేసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు.
పరిమళ ద్రవ్యాలు రాసుకుని నిద్రించడం:
రాత్రిపూట పరిమళ ద్రవ్యాలు (సెంట్లు/పెర్ఫ్యూమ్‌లు) ధరించడం లేదా రాసుకోవడం మానుకోవాలి. ముఖ్యంగా చీకటి పడిన తర్వాత ఇలాంటి బలమైన సువాసనలు కూడా నెగెటివ్ ఎనర్జీని ఆకర్షించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాత్రిపూట ఇంట్లో సాత్వికమైన వాతావరణం ఉండాలి. అగరుబత్తీలు లేదా కర్పూరం వంటి పవిత్రమైన సువాసనలు మంచి శక్తిని పెంచగా, కృత్రిమ పరిమళాలు వేరే రకమైన శక్తిని ఆకర్షించవచ్చు.
తల దువ్వుకోవడం:
చాలా మంది మహిళలు పడుకునే ముందు తల దువ్వుకుంటారు. అయితే సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రిపూట తల దువ్వుకోకూడదని, ఇది లక్ష్మీదేవికి ఆగ్రహం కలిగిస్తుందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. అలాగే రాత్రిపూట జుట్టు కత్తిరించుకోవడం లేదా గోళ్లు కత్తిరించుకోవడం కూడా అశుభంగా భావిస్తారు. అయితే పూర్వకాలంలో విద్యుత్ సదుపాయం తక్కువగా ఉండేది. చీకట్లో తల దువ్వడం వల్ల నేలపై జుట్టు పడితే దాన్ని సరిగ్గా శుభ్రం చేయలేకపోవడం, లేదా శుభ్రం చేసేటప్పుడు కష్టపడటం వంటి కారణాల వల్ల కూడా ఈ ఆచారం ఏర్పడి ఉండవచ్చు.
గొడవలు-వాదనలకు దిగడం:
రాత్రిపూట మహిళలు వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. ఇది కేవలం గొడవ పడిన వారిపైనే కాక, ఇంటి మొత్తం వాతావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గొడవ పడడం వల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూల శక్తి పెరుగుతాయి. రాత్రిపూట గొడవలు పడడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి.. నిద్రలేమి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రశాంతంగా నిద్రించడానికి, పడుకునే ముందు మనసు ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.
లక్ష్మీ కటాక్షం కోసం..
జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం.. మహిళలు రాత్రిపూట కొన్ని పనులను నివారించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. సూర్యాస్తమయం తర్వాత పెరుగు, ఉప్పు వంటి వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు లేదా దానం చేయకూడదు. ఇది ఇంట్లో ధనం నిల్వను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత లేదా రాత్రిపూట ఇల్లు ఊడ్చడం, తుడుచుకోవడం లేదా చెత్తను బయట పారవేయడం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించి.. దరిద్రం వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు.
ఇది కూడా చదవండి: మౌని అమావాస్య ప్రత్యేకత.. అమృత స్నానం, మౌనవ్రతంతో పుణ్య ఫలం గురించి తెలుసుకోండి!!
మహిళలు రాత్రిపూట వంటగదిలో ఎంగిలి పాత్రలను ఉంచకుండా శుభ్రం చేసి పడుకోవాలి. అపరిశుభ్రమైన వంటగది ఇంట్లో నెగెటివ్ శక్తిని పెంచుతుంది. గోడకు లేదా తలుపుకు కాళ్లు ఆనించి పడుకోవడం వల్ల కూడా అశుభాలు కలుగుతాయని.. దీనివల్ల లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. ఒకరి వస్త్రాలు లేదా ఆభరణాలు మరొకరు ధరించకూడదు. దీనివల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గుతుందని పెద్దలు చెబుతారు. శాస్త్రాలు సూచించిన ఈ నియమాలు కేవలం ఆచారాలుగానే కాకుండా.. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం.. అలాగే ఇంట్లో సానుకూల (Positive), ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడటం కోసం ఏర్పడిన జీవన విధానాలుగా మనం అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి: హల్దీ సమయంలో మొహానికి పసుపు ఎందుకు పూస్తారో తెలుసా?.. 99% మందికి ఈ విషయం తెలియదు!
Follow Us