/rtv/media/media_files/2025/10/09/morning-wake-up-important-habits-to-adopt-2025-10-09-06-32-49.jpg)
morning wake up important habits to adopt
ఉదయం లేచిన వెంటనే ఈ మూడు అలవాట్లు లేకపోతే మీ పని అయిపోయింది. ఇది కేవలం హెచ్చరిక కాదు, విజయాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ ఒక జీవన సూత్రం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం రోజంతా ఎంత ఉత్సాహంగా ఉంటామనేది మన ఉదయపు దినచర్యపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రతి రోజును పాజిటివ్‌నెస్‌తో ప్రారంభించడం అత్యవసరం. ఉదయాన్నే చేసే చిన్న పొరపాట్ల వల్ల మనం రోజు మొత్తం నిరాశగా ఉండిపోవాల్సి వస్తుంది. అయితే తప్పనిసరిగా అలవరచుకోవాల్సిన కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
నిద్ర లేవగానే మొబైల్‌కు దూరం
ఉదయం లేవగానే చాలామంది చేసే మొదటి పని మొబైల్ ఫోన్ చెక్ చేయడం. ఈ అలవాటు మెదడుపై అనవసరమైన భారాన్ని పెంచుతుంది. మెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు, భయానక వార్తల హెడ్‌లైన్స్‌తో మెదడు ఉదయాన్నే అశాంతికి గురవుతుంది. దీనివల్ల ఏకాగ్రత తగ్గి, రోజంతా చిరాకుగా, నిరుత్సాహంగా అనిపిస్తుంది. ఉదయం మన మెదడు శుభ్రమైన స్లేటులా ఉంటుంది. ఈ సమయాన్ని పాజిటివ్ ఆలోచనలతో నింపుకోవాలి. అందుకే నిద్ర లేచిన వెంటనే కనీసం 30 నిమిషాల పాటు మొబైల్‌కు దూరంగా ఉండటం అత్యంత ముఖ్యమైన అలవాటు.
నీరు తాగడం
ఉదయం లేవగానే చేయవలసిన అత్యుత్తమ అలవాటు ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం. రాత్రంతా నిద్రలో శరీరం డీహైడ్రేషన్ (Dehydration)కు గురవుతుంది. అందువల్ల ఉదయం నీరు తాగడం వల్ల శరీరం తక్షణమే హైడ్రేట్ అవుతుంది. మెదడు కణాలు చురుగ్గా మారుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరువెచ్చని నీరు తాగడం వలన శరీరంలోని విషాలు (Toxins) తొలగిపోయి రోజంతా ఉత్సాహంగా పనిచేసే శక్తి లభిస్తుంది. ఈ అలవాటు లేకపోతే మెదడు శక్తి తగ్గి, ఏకాగ్రత దెబ్బతిని, రోజువారీ పనిలో ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
ఉదయాన్నే నిద్రలేవాలి
చాలా మంది ఉదయం ఆలస్యంగా లేస్తారు. ఇది చాలా హానికరం. దీని వలన మెదడుకు వెంటనే పని ఒత్తిడి మొదలై, ఏ పనిపై దృష్టి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతారు. అందువల్ల ఉదయాన్నే లేవడం (బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయానికి ముందే) వల్ల శరీరంలో కొత్త శక్తి, మనస్సులో తాజాదనం వస్తుంది. ఈ ఉత్సాహమే మన పనిని పూర్తి చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి సకాలంలో నిద్రలేచి, మొబైల్‌ను పక్కన పెట్టి, నీరు తాగడం అనే ఈ మూడు చిన్న అలవాట్లను పాటిస్తే మీరు మీ పనిలో విజయం సాధించడం ఖాయం.