/rtv/media/media_files/2025/09/23/devi-navaratri-2025-09-23-12-15-50.jpg)
Devi Navaratri
దేవీ నవరాత్రులు ఎంతో ప్రత్యేకమైనవి. తొమ్మిది రోజుల పాటు ఎంతో భక్తితో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఈ నవరాత్రులు సమయంలో చాలా మంది ఉపవాసం ఉంటారు. కొందరు ఒక పూట భోజనం చేస్తే మరికొందరు మూడు పూటలు తినకుండా ఉపవాసం ఆచరిస్తుంటారు. అయితే ఒక రోజు ఉపవాసం ఉంటే పర్లేదు. కానీ తొమ్మిది రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పూర్తిగా ఏం తీసుకోకుండా ఉంటే ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నారు. అయితే ఉపవాసం వల్ల నష్టాలు ఏంటి? ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఈ స్టోరీలో చూద్దాం.
తలనొప్పి, అలసట
నవరాత్రులలో ఉపవాసం ఉన్నప్పుడు తలనొప్పి, అలసట ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే మనం తినే ఆహారం ద్వారా శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ లభించదు. గ్లూకోజ్ తగ్గడం వల్ల మెదడు సరిగ్గా పనిచేయదు. దీనివల్ల తలనొప్పి, కళ్లు తిరగడం, అలసట వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నీటి శాతం తగ్గడం
ఉపవాసం సమయంలో కొందరు సరిగ్గా నీళ్లు తాగరు. పండ్లు, పండ్ల రసాలు తీసుకోకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల తలనొప్పి, నాలుక ఎండిపోవడం, మూత్రం తక్కువ రావడం వంటివి జరుగుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల ప్రమాదకర సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
గ్యాస్, అసిడిటీ సమస్యలు
కొందరు ఉపవాసం ఉన్నప్పుడు చాలా గంటల పాటు ఏమీ తినకుండా ఉంటారు. దీనివల్ల పొట్టలో గ్యాస్, అసిడిటీ పెరుగుతాయి. కడుపులో మంట, ఛాతీలో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మధ్యమధ్యలో పండ్ల రసాలు, పాలు లేదా మజ్జిగ తాగడం మంచిది.
పోషక లోపం
సాధారణంగా మనం తినే ఆహారంలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలను మాత్రమే తింటారు. దీనివల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు సరిగ్గా అందకపోవచ్చు. ఇది శరీరానికి బలహీనతను తీసుకొస్తుంది. అందుకే ఉపవాసం ఉన్నప్పుడు కూడా పోషకాలు ఎక్కువగా ఉండే పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినడం చాలా అవసరం.
రక్తపోటులో మార్పులు
రక్తపోటు తక్కువగా ఉన్నవారు లేదా అధిక రక్తపోటు ఉన్నవారు ఉపవాసం ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఉపవాసం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు వస్తాయి. తక్కువ రక్తపోటు ఉన్నవారికి కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటివి జరగవచ్చు. కాబట్టి అన్ని రోజుల పాటు ఉపవాసం ఆచరించకపోవడం బెటర్ అని నిపుణులు అంటున్నారు.
కండరాల నొప్పులు
ఉపవాసం ఉన్నప్పుడు శరీరానికి తగినంత ప్రోటీన్ అందదు. దీనివల్ల కండరాలు బలహీనపడి, నొప్పులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఉపవాస సమయంలో కూడా పాలు, పన్నీర్, గింజలు వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.