BRS MLA KTR : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తుందని అడిగితే అందరు చెప్పే మాట శ్వేతపత్రాలు ట్రెండ్ అని అంటున్నారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గత 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రగతి రిపోర్టును(శ్వేతపత్రం) అసెంబ్లీలో ప్రస్తావిస్తోంది. ఇటీవల తెలంగాణ(Telangana) రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు విద్యుత్ రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ శ్వేతపత్రాలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు గట్టిగానే జరిగాయి.
ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రం కాదని బీఆర్ఎస్ పార్టీపై బురద చల్లే పత్రం అని మండిపడ్డారు. తెలంగాణ అప్పుల గురించే కాదు గత 10 ఏళ్లలో పెరిగిన ఆస్తుల విలువలపై కూడా శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొమ్మిదిన్నరేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని వివరించేందుకు ఈ రోజు ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. 'తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం, పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం.. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్' అంటూ రాసుకొచ్చారు.
ALSO READ: టీడీపీలో ఫ్యామిలీ ప్యాకేజీ.. టికెట్ల కోసం నేతల పట్టు..