ఎట్టకేలకు రెండు రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెరదించారు. బీజేపీ (BJP) రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు కూడా వెల్లడించారు. ఎల్లుండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై తీవ్ర చర్చ సాగుతోంది. మునుగోడు టికెట్ కోసం ఆయన పట్టుబట్టినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: Big Breaking: బీజేపీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా
చివరికు కాంగ్రెస్ కూడా రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి మునుగోడు నుంచే బరిలోకి దిగనున్నారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో ఓడిన చోటే మళ్లీ విజయం సాధించి సత్తా చాటాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: TS elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?
ఇప్పటికే ఆయన ఈ మేరకు గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే.. కోమటిరెడ్డి రాకతో మునుగోడు టికెట్ పై ఇన్నాళ్లు ఆశ పెట్టుకున్న చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్నా కైలాష్ తదితర నేతల పరిస్థితి ఏంటనే అంశం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.