గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని నాని సైలెంట్ గా ఉన్నారు. మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో బాగా యాక్టీవ్ గా తిరుగుతూ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేశినేని చిన్నిపై అనేక సందర్భాల్లో పరోక్ష విమర్శలు చేశారు కేశినేని నాని. ఈ క్రమంలోనే విజయవాడ పార్లమెంట్ పరిధిలో టీడీపీ రెండుగా చీలిపోయింది. కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తాజాగా నందిగామలో కార్యకర్తలతో కేశినేని నాని భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో కేశినేని నానికి ధీటుగా చిన్ని వర్గీయులు కూడా పోటా పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా కేశినేని నానికి, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మధ్య దూరం మరింత పెరిగింది. కేశినేని నాని నందిగామ నియోజకవర్గ పర్యటనకు హాజరు కాని మాజీ ఎమ్మెల్యే సౌమ్య.
కేశినేని బ్రదర్స్ వార్:
విజయవాడ రాజకీయాల్లో ఫ్యామిలీ వార్ మరింత ముందురుతోంది. ఎంపీ కేశినేని నాని కుటుంబ వ్యవహారం.. తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. కేశినేని నాని.. తన సోదరుడైన కేశినేని శివనాథ్ అలియాస్ కేశినేని చిన్నిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం రచ్చకెక్కింది. ఇక అప్పటి నుంచి ఇద్దరి సోదరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
ఈ కంప్లైంట్ పై స్పందించిన కేశినేని చిన్ని.. ఓ చిల్లర వివాదంలోకి ఎంపీ కేశినేని నాని నా కుటుంబాన్ని లాగడం బాధాకరమన్నారు. ఆ స్టిక్కర్ ఎవరిదో ఏంటో విచారణలో తేలనివ్వాలని చెప్పారు. కేసు విషయమై తన కారును హైదరాబాద్ లో పోలీసులు అడ్డుకున్నారని.. కమిషనర్ ఆఫీసుకు తీసుకెళ్లి ఎంక్వైరీ చేసినట్లు వెల్లడించారు. పార్టీలో తాను ఓ చిన్న కార్యకర్త మాత్రమే అని, చంద్రబాబు సీఎం కావడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు కేశినేని చిన్ని.
మరోవైపు తనను కాదని.. చిన్నిని టీడీపీ పెద్దలు ఎంకరేజ్ చేస్తున్నారనే ఫీలింగులో ఉన్నారు నాని. అయితే పార్టీ పెద్దలు నానిని దూరం చేసుకోవడం ఇష్టం లేదనే సంకేతాలిస్తూనే ఉన్నారట. కాకపోతే పార్టీ హైకమాండ్ లో వచ్చిన గ్యాప్ ను తగ్గించుకోవడానికి కేశినేని నాని చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారట. మరి రానున్న రోజుల్లో బెజవాడ రాజకీయాలు ఎలా సాగుతాయో చూడాలి.