RS Praveen: బీఆర్ఎస్‌లో కీలక నేతగా మారుతున్న ఆర్ఎస్పీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో కీలకనేతగా ఎదుగుతున్నారు. దళితనేత, స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రవీణ్‌కు కేసీఆర్ అధిక ప్రధాన్యత ఇస్తున్నారు. 2028 అధికారమే లక్ష్యంగా ప్రవీణ్‌ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సమాచారం.

New Update
RS Praveen: బీఆర్ఎస్‌లో కీలక నేతగా మారుతున్న ఆర్ఎస్పీ.. కేసీఆర్ వ్యూహం ఇదేనా?

RS Praveen: ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ (KCR) పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారు. దళితనేత, ఉన్నతవిద్యావంతుడు, గురుకులాల సెక్రటరీగా స్పెషల్ అండ్ క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన బీఆర్ఎస్ (BRS) మీటింగ్, పలు కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆర్ఎస్పీ. ప్రతి మీటింగ్‌లో కేటీఆర్ పక్కనే ఉంటున్నాడు. అంతేకాదు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రతిపక్షాలపై విమర్శల బాణాలు వదులుతున్నాడు. రోజు రోజుకూ ఆయనకు ప్రాధాన్యం పెరగడంపై పార్టీ, రాజకీయావర్గాల్లో చర్చ నడుస్తోంది. వ్యూహాత్మకంగానే ఆర్ఎస్పీని అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ ముందుపెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ప్రవీణ్ కుమార్‌కు డిప్యూటీ సీఎం హామీ..
ఇక ప్రవీణ్ కుమార్‌ దళితుడు కావడంతో తమకు కలిసివస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ముఖ్యంగా 2028 ఎన్నికల నాటికి దళిత, బీసీ, నిరుద్యోగ వర్గాల్లో సానుకూలత పెరుగుతుందని, ఇందులో భాగంగానే ప్రవీణ్ కుమార్‌కు మరింత ప్రధాన్యత ఇస్తూ కీలకంగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పినప్పటికీ డిప్యూటీ సీఎంగా తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిలకు అవకాశం కల్పించారు. ఇదే తరహాలో అవసరం అయితే ప్రవీణ్ కుమార్‌ను డిప్యూటీ సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించే ఛాన్స్ కూడా ఉన్నట్లు సన్నిహిత వర్గాల్లో చర్చ నడుస్తోంది.

కవితకు మద్ధతు, కేసీఆర్ పై పొగడ్తలు..
ఇదిలా ఉంటే.. ఇటీవల బాల్క సుమన్‌తో కలిసి ఢిల్లీ తిహార్ జైలు వెళ్లి కవితను కలిసిన ప్రవీణ్ కుమార్ ఈసీ, బీజేపీ ప్రభుత్వంపై తనదైన స్టైల్ లో ఆరోపణలు చేశారు. కవిత అరెస్ట్ అక్రమమని, ఆమె నిర్దోషిగా బయటకొస్తుందని మద్ధతుగా నిలిచారు. ఇక కొల్లాపూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్త హత్య సందర్భంగా నిర్వహించిన నిరసనలోనూ ఆర్ఎస్పీ కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ లో చేరిన మొదట్లో.. గత పదేండ్లు కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం నడిచిందన్నారు ఆర్ఎస్ప్రవీణ్ కుమార్. చితికి పోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారని, మరోసారి కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన ప్రవీణ్ కుమార్.. ‘మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కన్ని కాలేను’ అంటూ సెటైర్లు వేశారు. ప్రవీణ్ కుమార్‌ను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని కేసీఆర్ సైతం చెప్పారు. బహుజన సిద్ధాంతం అమలు దిశగా దేశానికి తెలంగాణను టార్చ్ బేరర్‌గా చేద్దామని కేసీఆర్ పిలుపునివ్వడం విశేషం.

Advertisment
Advertisment
తాజా కథనాలు