కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఎల్బీ నగర్‌లో పర్యటించిన ఆయన రంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో స్థానిక బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మలా మారారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ అవినీతి పాలన సాగిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న అయుష్మాన్ భారత్ స్కీమ్‌ను రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. తెలంగాణలో నడుస్తోన్న కుటుంబ పాలన, దుష్టపాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ బీ టీమ్‌గా పని చేస్తోందని తరుణ్ చుగ్ విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని తురుణ్ చుగ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను నమ్మి రాష్ట్ర ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లను మంజూరు చేసిందని తెలిపిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విడుదల చేసిన ఇళ్లను లబ్దిదారులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దేశంలో గ్రామ గ్రామాన స్వాతంత్య్ర సమరయోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల విగ్రహాలు ప్రతిష్టిస్తామన్నారు. రాష్ట్రంలో నేటి నుంచి మేరి మట్టి మేరి దేశ్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపిన ఆయన.. నేటి నుంచి ఆగస్టు 31 వరకు బీజేపీ కార్యకర్తలు ప్రతీ గ్రామాల్లో పర్యటించి పిడికెడు మట్టిని సేకరిస్తారని, రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన మట్టతో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అమృత్ వన్ నిర్మిస్తామన్నారు.
హైదరాబాద్ మెట్రో నగరానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను పక్కదారి పట్టించినట్లు తరుణ్ చుగ్ ఆరోపించారు. గతంలో రైతుబంధు, రైతుబీమాతో రైతులను మోసం చేసిన బీఆర్ఎస్ సర్కార్.. ఇప్పుడు డబుల్ బెడ్ రూమ్‌తో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నా.. బీఆర్‌ఎస్ సర్కార్ మాత్రం తామే నిర్మించామని ఇందులో కేంద్ర ప్రభుత్వ నిధులు లేవని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గత 9 సంవత్సరాలుగా కేసీఆర్ నియంత పాలనను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న తరుణ్ చుగ్.. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గద్దె దింగడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరవేస్తామని జోస్యం చెప్పారు. కేంద్రంలో కూడా మళ్లీ బీజేపీ సర్కారే వస్తోందన్నారు