అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నేతలు స్వాగతిస్తున్నారు. పార్టీ ప్రయోజనాల కోసం నిస్వార్థంగా వ్యవహరించారంటూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు ఒబామా కూడా బైడన్ నిర్ణయాన్ని కొనియాడారు. బైడెన్ తీసుకున్న నిర్ణయం దేశంపై ఆయనకున్న ప్రేమను చాటుతోందని వ్యాఖ్యానించారు. రెండోసారి ఎన్నికల్లో బైడెన్‌కు పోటీ చేసే అర్హత ఉన్నప్పటికీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటే ఆయన గొప్ప దేశభక్తుడని కొనియాడారు. బైడన్ అంతర్జాతీయ వేదికపై అమెరికా ఔన్నత్యాన్ని ఇనుమడింపజేశారని.. నాటోను పురుజ్జీవింపజేశారని తెలిపారు. అలాగే ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలను ఏకం చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో ఊహించని పరిణామాలు ఎదురవుతాయన్న ఒబామా.. డెమోక్రటిక్ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు.
అయితే ఉపాధ్యాక్షురాలు కమలా హారిస్ అభ్యర్థిత్వాని బైడెన్ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఒబమా మాత్రం ఇప్పటివరకు హారిస్‌కు మద్దతు ప్రకటించలేదు. కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ సరైన ప్రక్రియతో రావాలని ఆయన పిలుపునివ్వడం చర్చనీయం అవుతోంది. అలాగే డెమోక్రటిక్ పార్టీకి చెందిన మరో కీలక నేత నాన్సీ పెలోసీ కూడా హారిస్‌కు మద్దతు ప్రకటించలేదు. మరో విషయం ఏంటంటే బైడెన్ అంగీకరించినంత మాత్రాన కమలా హారిస్ అభ్యర్థి కాలేరు. వచ్చే నెలలో పార్టీ సదస్సు జరగనుంది. ఈ సమావేశంలోనే అధ్యక్ష అభ్యర్థి నిర్ణయమవుతారు. మొత్తం 4,700 మంది ప్రతినిధులు నామినినీ ఆమోదిస్తారు.
Also Read: బడ్జెట్ లో రైతులకు శుభవార్త చెబుతారా? పీఎం కిసాన్ డబ్బులు పెరుగుతాయా?
మరోవైపు.. తనను అధ్యక్ష అభ్యర్థి నామినీగా మద్దతు పలికినందుకు బైడెన్‌కు కమలా హారిస్ ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్ష అభ్యర్థి నామినీగా తనకు మద్దతు పలికినందుకు అధ్యక్షుడు జో బైడెన్‌కు కమలా హారిస్ (Kamala Harris) ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షుడి ఆమోదం పొందడం గౌరవంగా భావిస్తున్నానని.. ఈ నామినేషన్‌ను సాధించి గెలవడమే తన ఉద్దేశమన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, ఆయన అతివాద ‘ప్రాజెక్టు 2025’ అజెండాను ఓడించడం కోసం దేశాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే హారిస్‌కు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే తమ మద్దతును ప్రకటించారు.
బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచి తప్పుకొని.. హారిస్‌ను అభ్యర్థిగా ప్రకటించడంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ కంటే కమలా హారీస్‌ను ఓడించడం చాలా తేలిక అంటూ ఓ వార్తా సంస్థకు వివరించాడు. బైడెన్ హయాంలో మాతో పాటు అమెరికా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని.. మేము అధికారంలోకి వచ్చి తర్వాత బైడెన్ చేసిన డ్యామేజ్‌ని పూర్తి స్థాయిలో నివారిస్తామంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదిలాఉండగా ఇటీవల ట్రంప్‌పై హత్యాయత్నం జరగడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన జరిగిన తర్వాత ట్రంప్ గ్రాఫ్ పెరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అలాగే తనకు బలమైన ప్రత్యర్థి అయిన జో బైడన్ అధ్యక్ష రేసులో నుంచి తప్పుకోవడం, ఒబామా సైతం కమలా హారిస్‌కు మద్దతు ఇవ్వకపోవడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ట్రంప్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా?