ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. రెండోసారి అధికారం దక్కించుకోవాలని అధ్యక్షుడు జో బైడెన్.. పోయిన అధికారాన్ని మరోసారి చేజిక్కించుకోవాలని డోనాల్డ్ ట్రంప్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే జో బైడెన్‌కు వయసురీత్యా ఇబ్బందులు తలెత్తుతున్నాయని వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. తన ప్రధాన పోటీదారుడు, ట్రంప్ తప్పులు చేస్తున్నారని అన్నారు. మాజీ అధ్యక్షుడు తన భార్యను వేరు పేరుతో పిలిచారంటూ ఇటీవల బయటపడ్డ నివేదికను ప్రస్తావించారు. లేట్‌నైట్ విత్ సేథ్ మేయర్స్ షోలో బైడెన్ ఈ విధంగా స్పందించారు.
Also Read: పతంజలి ఉత్పత్తుల యాడ్స్‌పై నిషేధం విధించిన సుప్రీంకోర్టు..
భార్య పేరు మరిచిపోయారు
'మీరు అవతలి వ్యక్తిని (ట్రంప్‌ను ఉద్దేశించి) పరిశీలించాలి. ఆయనది కూడా దాదాపు నా అంత వయసే ఉంటుంది. ఆయన తన సతీమణి పేరును గుర్తుంచుకోలేరు. ఆయన ఆలోచనలు కాలం చెల్లనివి' అంటూ బైడెన్ తీవ్రంగా విమర్శించారు. అసలు ట్రంప్ నిజంగానే తన భార్యను వేరే వాళ్ల పేరుతో పిలిచారా లేదా అనేదానిపై స్పష్టత లేదు. అయితే వయసురీత్యా అమెరికా అధ్యక్షుడు బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలు గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదికలో బయటపడింది. అందులో 81 ఏళ్ల బైడెన్‌కు జ్ఞాపకశక్తి చాలా మసకగా ఉన్నట్లు పేర్కొంది.
నివేదిక ఏం చెప్పిందంటే
ఆయన తన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా గుర్తుకు తెచ్చుకోలేకపోయారని ఆ నివేదిక చెప్పింది. కొడుకు బ్యూ బైడెన్ ఎప్పుడు చనిపోయారనే విషయం ఆయనకు గుర్తు లేదని తెలిపింది. అంతేకాదు ఉపాధ్యక్షునిగా పనిచేసిన కాలం కూడా బైడెన్‌కు జ్ఞాపకం లేదని వెల్లడించింది. అయితే ఈ నివేదికను జో బైడెన్ ఖండించారు. అయితే దీనికి ముందు కూడా బైడెన్ జ్ఞాపకశక్తిని ప్రత్యక్షప్రసారంలో చూసిన అమెరికన్లు షాకైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఏడాది ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇవి రిపబ్లికన్ పార్టీకి ప్రచారస్త్రాలుగా మారాయి. ఇలాంటి నేపథ్యంలోనే బైడెన్.. ట్రంప్‌ను విమర్శించారు.
Also Read: భారతీయులకు దుబాయ్ బంపర్ ఆఫర్.. ఐదేళ్ల మల్టిపుల్ ట్రావెల్ వీసా