JC Prabhakar Reddy gets 41 CRPC Notice from Police over College Wall Issue: అనంతపురంలోని తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రిలోని జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విషయంలో గత వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా దీనిపై మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. దీంతో ఈ వివాదం మరింత వేడెక్కింది. ఈ వ్యవహారంపై జేసీకి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసు తీసుకోవడానికి ఆయన నిరాకరించారు. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని తాను ఎక్కడా అనడం లేదన్నారు.
ప్రహరీ గోడకు సంబంధించి అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కనీస స్పందన లేదన్నారు. కేవలం సర్వే చేసి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నానని అన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా.. కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల మేరకు సర్వే చేయాలని అధికారులను కోరారని, కానీ ఫలితం లేదని వాపోయారు. తాడిపత్రి మున్సిపాలిటీకి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఉందని.. దాని మేరకు మాత్రమే నిర్మాణం చేపట్టాలని జేసీ అన్నారు.
మున్సిపల్ ఉద్యోగుల కోసం 1983లో లే అవుట్ లోనే 50 అడుగులు రోడ్డు ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 2022లో 60 అడుగులతో మున్సిపల్ అప్రూవల్ ఉందని.. ఆర్ అండ్ బీ అధికారులకు అర్జీలు పెట్టుకున్నామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే అన్నీ సగం సగం పనులు చేసి, ఊరును పాడు చేస్తున్నాడని ఆరోపణలు చేశారు. పోలీసులు బందోబస్తు పెట్టుకుని గోడ కడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా వేదికను కూల్చడానికి 10 నిమిషాలు పట్టలేదని.. అదే విధంగా ప్రహరీ గోడ ఎన్ని రోజుల్లో కట్టారో, అన్ని నిమిషాల్లోనే కూలుస్తామని హెచ్చరించారు. ఐఏఎస్ & ఐపీఎస్ కు సెల్యూట్ చేస్తున్నానని.. ఈ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని.. మీకసలు నిద్రెలా పడుతోందని ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.