గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన పార్టీ బలం ఉన్న రామచంద్రపురం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం జరగడంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా పోలిశెట్టి చంద్రశేఖర్ ప్రాతనిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజులుగా అమలాపురం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయిన వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసే పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Also Read: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అప్‌లోడ్ చేసిన ఈసీ
రామచంద్రపురం నియోజకవర్గం సీటును జనసేన పార్టీ ఇంఛార్జి అయిన పోలిశెట్టి చంద్రశేఖర్‌కు కేటాయించాలని.. ఇలా కుదరకపోతే నాగబాబును తమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపాలని డిమాంట్ చేస్తున్నారు. తమ నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎక్కువగా ఓట్ బ్యాంక్ ఉందని.. ఇక్కడి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయిస్తే.. కచ్చితంగా గెలిపించుకుంటామని తేల్చిచెబుతున్నారు.
ఇదిలాఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ మే 13న అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఓవైపు వైసీపీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి జగన్ సర్కార్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. గురువారం రోజున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల ఖరారు, ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.