Pawan Kalyan Wishes To Telangana People : తెలంగాణ (Telangana) లో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తాజాగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం సకల జనుల విజయం అని అన్నారు. పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ తనలో పోరాట స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ (X) లో.. "భారతదేశ చరిత్రలో తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉంది. 1947లో తెలంగాణ మినహా దేశమంతటికీ స్వతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం కోసం తెలంగాణ మరో రెండు సంవత్సరాలు వేచిచూడవలసి వచ్చింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (Telangana Formation) కోసం సుమారు 60 సంవత్సరాలపాటు ఎదురుచూడవలసి వచ్చింది. సకల జనుల కల సాకారమై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పుడే దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. పోరాటాలకు పురిటి గడ్డయిన తెలంగాణ నాలో పోరాట స్ఫూర్తిని నింపింది. ఇక్కడ గాలిలో.. నేలలో.. నీటిలో.. మాటలో... చివరకు పాటలో సైతం పోరాట పటిమ తొణికిసలాడుతుంది. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సకల జనులు సాగించిన ఉద్యమాన్ని పాలకులు సదా గుర్తెరగాలి. ప్రజలందరికీ తెలంగాణ ఫలాలు సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా అందాలి. అభివృద్ధిలో తెలంగాణా రాష్ట్రం అగ్రపథంలో పాలకులు నిలపాలి. ప్రజా తెలంగాణను సంపూర్ణంగా ఆవిష్కరింప చేయాలి. అప్పుడే ఈ రాష్ట్ర ఆవిర్భావం కోసం ప్రాణాలను బలిదానం చేసిన అమరులకు నిజమైన నివాళి. ఈ దశాబ్ద వేడుకల సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను." అంటూ రాసుకొచ్చారు.
సకల జనుల విజయం... తెలంగాణ ఆవిర్భావం - JanaSena Chief Shri @PawanKalyan #TelanganaFormationDay pic.twitter.com/m187Brt5lD
— JanaSena Party (@JanaSenaParty) June 2, 2024
Also Read : 🔴Live Updates: తెలంగాణ పదేళ్ల పండుగ.. ఊరూరా స్వరాష్ట్ర సంబరాలు