Odisha : ఒడిశాలోని పూరీ జగన్నాథుడి (Puri Jagannath) రత్న భాండాగారం (Ratna Bhandar) తెరుచుకుంది. జస్టీస్ బిశ్వనాథ్ రథ్ సూచనలతో అధికారాలు దీన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభమైంది. 1978లో చివరిసారిగా భాండాగారాన్ని తెరిచారు. మళ్లీ 46 ఏళ్ల తర్వాత ఇప్పుడు తెరుచుకుంది. రత్న భండాగారంలోని నిధిని లెక్కించేందుకు వేరే ప్రాంతానికి తరలించనున్నారు. దీనికోసం చెక్కపెట్టేలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆభరణాల లెక్కింపు తదితర ప్రకియ అంతా కూడా డిజిటలైజేషన్ (Digitalization) చేయనున్నారు.
ఈ ఆలయంలో జగన్నాథునికి నిత్యం 119 మూలికా సేవలు జరుగుతాయి. సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా భాండాగారాన్ని ఒపెన్ చేసేందుకు అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. అయితే ప్రస్తుతం అక్కడ రథయాత్ర జరుగుతోంది. జులై 19 వరకు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయం బయట ఉంటారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టనున్న లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు భాండాగారం లోపల విష సర్పాలు ఉంటాయన్న అనుమానాలు రావడంతో పాములు పట్టే నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు రహస్య గదిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
Also Read: అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు!
వాస్తవానికి పూరీ జగన్నాథుడి ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో పెట్టి.. రహస్య గదిలో దాచారు. పూర్వం మూడేళ్లు లేదా ఐదేళ్లకొకసారి ఈ రహస్య గది తలుపులు తెరిచి నిధిని లెక్కించేవారు. 1978లో భాండాగారంలో ఉన్న నిధిని లెక్కించేందుకు 70 రోజులు పట్టింది. అంతేకాదు అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో నిధి లెక్కలపై సందేహాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంపై దర్యాప్తు జరిపిన కోర్టు.. రహస్య గదిలో నుంచి భాండాగారం తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు కూడా దీనికి మద్దతు తెలిపింది. అయితే రహస్య గదులు జీర్ణావస్థకు చేరి.. వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్న నేపథ్యంలో మరమ్మతులు చేయాలని న్యాయస్థానాలు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి.
2019లో ఏప్రిల్ 6వ తేదీన అప్పటి సీఎం నవీన్ పట్నాయక్ ప్రభుత్వం రహస్య గదిని తెరవడానికి 13 మందితో కూడిన అధ్యయన సంఘాన్ని నియమించింది. కానీ తలుపులు తెరవడానికి వెళ్లగా.. రహస్య గది తాళపుచెవి కనిపించలేదు. ఆ తర్వాత మరమ్మలకు చర్యలు తీసుకోవడంపై ప్రభుత్వం.. జస్టిస్ రఘువీర్‌దాస్ కమిటీని నియమించింది. ఈ క్రమంలోనే డూప్లికేట్ తాళపుచెవిని పూరీ కలెక్టరేట్ ఖజనాలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు రఘువీర్ కమిటీ రిపోర్ట్‌ను కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే దీన్ని ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా వాడుకుంది. తాము అధికారంలోకి వస్తే.. జగన్నాథుడి భాండాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే విశ్రాంత జడ్జి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఈ కమిటీ రత్న భాండాగారాన్ని ఓపెన్ చేయాలని ప్రభుత్వానికి నివేదించింది. దీంతో 46 ఏళ్ల తర్వాత మళ్లీ భాండాగారం తెరుచుకుంది. ఇందులో ఎంతవరకు నిధి ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : టార్గెట్ జగన్.. త్వరలో విశాఖ ఫైల్స్.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు