జగనన్న ఆరోగ్య సురక్ష అనే గొప్ప పథకాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సీఎం జగన్ దేశంలో ఎక్కడా లేని పథకాలు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తూ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఆయన దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. రానున్న రోజుల్లో జగన్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు, ప్రతి వ్యక్తికి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని దశల వారీగా నిర్వహిస్తామన్న మంత్రి.. ఐదు దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్ర వ్యాప్తంగా 45 రోజుల పాటు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అవసరమైన వారికి ప్రభుత్వం ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. దాని కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి తమ సిబ్బందితో తాము సిద్ధంగా ఉన్నామన్న ఆమె.. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పథకం కింద 3257 ప్రొసిజర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో 90 శాతం మంది లబ్దిపొందే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని చూస్తుంటే.. విపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన నేతలు అసత్య ప్రచారాలతో రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని రజిని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంపై విపక్ష నేతలు ఎలాంటి ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మరన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.