పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అయుతే వివాహం అనంతంరం.. కొన్ని జంటలు కలకాలం కలసి ఉంటాయి. మరికొన్ని జంటలు పలు కారణాల వల్ల విడిపోతాయి. అయితే ఈ మధ్యకాలంలో.. ప్రముఖ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు కూడా తమ భాగస్వాములతో విడుపోతున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు తాజాగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తన భాగస్వామి ఆండ్రియా గియాంబ్రునోతో విడిపోతున్నారు. పదేళ్ల తమ బంధం ముగిసిపోయిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ ప్రకటన చేసింది. అయితే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఓ బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గియాంబ్రునో చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల వళ్లే వారి బంధానికి ముగింపు పడినట్లు సమాచారం.
ఆండ్రియా గియాంబ్రునోతో నా పదేళ్ల అనుబంధం ఇప్పటితో ముగిసిపోయింది. కొంతకాలంగా మేం ప్రయాణించే దారులు కూడా మారిపోయాయి. ఇప్పుడు దాన్ని గుర్తించే సమయం ఆసన్నమైంగని జార్జియా మెలోని పోస్టు చేసింది. అయితే వీళ్లిద్దరికి ఓ కుమార్తె కూడా ఉంది. ఇదిలా ఉండగా.. దేశంలో సామూహిక అత్యాచార ఘటనల గురించి కొద్దినెలల క్రితం గియాంబ్రునో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ విషయాలపై గియాంబ్రునో ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. మీరు సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లినప్పుడు తాగుతారు. అయితే అప్పుడు అతిగా మద్యం సేవించకుండా ఉన్నట్లైతే.. మీరు ఇబ్బందుల్లో పడరు. అత్యాచారాన్ని నివారించాలంటే.. మీరు స్పృహ కోల్పోకుండా ఉండాలంటూ పేర్కొన్నారు. అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇటలీలో తీవ్ర విమర్శలకు దారీ తీశాయి. అయితే దీనిపై స్పందించిన గియాంబ్రునో.. మద్యం సేవించేందుకు, డ్రగ్స్ కోసం యువత బయటకు వెళ్లొద్దని చెప్పడమే నా ఉద్దేశమని.. బయట చెడు వ్యక్తుల నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
అయితే ఇటీవల కాలంలో మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ఆయన అసభ్యకరమైన భాష వాడిన రికార్డింగ్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. తన భాగస్వామి ప్రవర్తనతో తనపై ఒక అంచనాకు రాకూడదని.. అలాగే ఆయన ప్రవర్తనపై భవిష్యత్తులో తాను ఎలాంటి సమాధానాలు ఇవ్వనని ఇటలీ ప్రధాని జార్జియా ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవిషయం ఏంటంటే జార్జియా మెలోనీ ఇటలీకి తొలి మహిళా ప్రధాని. గత ఏడాదే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ తరఫున పోటీలోకి దిగిన ఆమె దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి చరిత్ర లిఖించారు.