భారత్,ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్ కప్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలుంది. ఎప్పుడెప్పుడు మధ్యాహ్నం 2 గంటలవుతుందా అని కోట్లాది మంది క్రికెట్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తు్న్నారు. ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో 10 మ్యాచ్‌లు వరుసగా గెలుస్తూ వచ్చిన టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను కనబర్చింది. రోహిత్, కోహ్లి అద్భుత బ్యాటింగ్ విన్యాసాలు, శ్రేయస్, రాహుల్ దూకుడు, షమీ వికెట్ల వరద, జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శన అనేవీ అభిమానుల మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఇక సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తుగా ఓడించడం మరింత రెట్టింపు ఆశలను పెంచేసింది. 2011లో చివరిసారిగా వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఈసారి కూడా వరల్డ్ కప్‌ను దక్కించుకునేందుకు తహతహలాడుతోంది. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
Also read: మోదీ గడ్డపై తొడగొట్టేదేవరు..? ఫైనల్ ఫైట్‌కు సిద్ధమైన రోహిత్ టీమ్
మరి ఇప్పుడు అక్కడ వాతావరణ పరిస్థితి ఏంటి.. ఒకవేళ వర్షం పడితే ఎలా అని చాలామంది క్రికెట్ అభిమానుల్లో ఓ ఆందోళన మొదలైంది. కానీ వాతావరణశాఖ క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ తెలిపింది. ఈరోజు అహ్మదాబాద్‌లో వర్షం పడే ఛాన్సే లేదని చెప్పింది. మధ్యాహ్నం పూట దాదాపు 33 డిగ్రీల సెల్సియస్ వరకు ఎండ ఉంటుందని పేర్కొంది. అలాగే రాత్రికి 20 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోతుందని వెల్లడించింది. అయితే ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు వాతావరణం పరంగా ఎలాంటి ఆటంకం కలగదనే విషయం స్పష్టమవుతోంది. ఒకవేళ పరిస్థితులు తలకిందులై వర్షం పడితే.. ఐసీసీ రిజర్వు డే ఇచ్చి.. మళ్లీ సోమవారం రోజున మ్యాచ్ నిర్వహిస్తుంది. మ్యాచ్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్లీ స్టార్ట్ అవుతుంది.