/rtv/media/media_files/2025/08/30/trump-2025-08-30-14-38-14.jpg)
Trump
అమెరికా, భారత్ ల వాణిజ్య ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా భారత్ తో తాము కలిసే ఉన్నామని..ఇప్పటికీ అదే సంబంధం కొనసాగిస్తున్నామని అన్నారు అయితే తమపై ఆ దేశం భారీగా సుంకాలు విధిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. ఈరోజు వైట్ హౌస్ ఓవల్ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో భారత్ పై విధించిన సుంకాల గురించి మళ్ళీ మాట్లాడారు. తాను అధికారంలోకి వచ్చాకనే భారత్ తో వాణిజ్య ఒప్పందాల విషయంలో మార్పును తీసుకువచ్చానని చెప్పారు. యూఎస్ దిగుమతులపై భారత్ విధిస్తున్న భారీ సుంకాలను ఇక మీదట ఒప్పుకునేది లేదని అన్నారు. దానికి తగ్గట్టుగానే అమెరికా కూడా టారిఫ్ లను విధించిందని చెప్పుకొచ్చారు. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు కానీ, వారు మాతో చేస్తున్నారని అన్నారు.
వాళ్ళే మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు..
ఇండియా ఉత్పత్తులు యూఎస్ లో భారీగా దిగుమతి అవుతున్నాయి. దీని వలన అమెరికా తయారీదారులకు తీవ్ర నష్టం కలుగుతోంది. మరోవైపు అమెరికా ఉత్పత్తులు మాత్రం భారత్ కు ఎగుమతి అవడం లేదు. చేస్తున్న వాటి మీద కూడా 100శాతం సుంకాలను విధిస్తున్నారు. అవి ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. అందుకే తాను కూడా సుంకాలను విధించానని...తాను చేసిన పనిని సమర్ధించుకున్నారు ట్రంప్. మేము భారత్‌తో చిన్నపాటి వ్యాపారం చేస్తామని కొందరు అనుకుంటారు. కానీ భారత్ మాతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తోంది. ఇంకో మాటలో చెప్పాలంటే.. మాకు వాళ్లు పెద్ద సంఖ్యలో వస్తువులు అమ్ముతుంటారు. వారికి అతిపెద్ద క్లైయెంట్ మేమే. కానీ మేము మాత్రం వాళ్లకి చాలా తక్కువగా అమ్ముతున్నాం. గత దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. భారత్ ఏ దేశంపై కూడా విధించని అధిక టారిఫ్‌లు మాపై విధించింది. అందువల్ల మా వ్యాపారాలను భారతీయులకు అమ్మలేకపోతున్నామని ట్రంప్ చెప్పారు.
మరోవైపు భారత్ పై ట్రంప్ విధించిన సుంకాలపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆయన తీసుకున్నది అతి చెత్త నిర్ణయం అని అంటున్నారు. దాంతో పాటూ ట్రంప్ విధించిన సుంకాలు చాలా వరకు చట్టవిరుద్ధమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ తన ఆర్థిక అధికారాలకు మించి టారిఫ్ విధించారని చెప్పారు. భారీగా అమలు చేసిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు కామెంట్ చేసింది. వీటిని అక్టోబర్ మధ్య వరకే అనుమతి ఇస్తున్నామని...ఆ తరువాత వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పింది. అయితే ఈ తీర్పును యూఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు మాత్రం కోర్టు అనుమతినిచ్చింది.
Also Read: National Guards: షికాగో చాలా ప్రమాదకరంగా ఉంది..రక్షణ అవసరం..ట్రంప్