/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)
మామూలుగా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికాకే వెళ్ళాలని అనుకుంటారు. ముఖ్యంగా భారతీయులు ఎక్కువ యూఎస్ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు. ఉద్యోగాలు, చదువులు ఇలా చాలా మంది కలలు కంటారు. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వచ్చాక వీసాలు రావడం చాలా టఫ్ అయిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వీసాల ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కేవలం స్టూడెంట్ వీసాలకే కాకుండా, బిజినెస్, టూరిస్ట్ ఇలా అంతా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీనికి కారణం వీసా నిబంధనల్లో మార్పులే అని చెబుతున్నారు. అంతేకాదు చాలా మంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కూడా. ఫలితంగా పలువురు సంవత్సరాల పాటు వీసాల కోసమే తిరగాల్సి వస్తోంది.
డబ్బులు కడితే వీసా ఇంటర్వ్యూ..
అయితే ఇప్పుడు అమెరికా ప్రభుత్వం దీనికో సొల్యూషన్ తీసుకురావాలని అనుకుంటోంది. దాంతో పాటూ తమ దేశానికి డబ్బులు వచ్చేలా కూడా చేయాలని అనుకుంటోంది. దానకోసం ఓ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టనుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులుగా వీసా ఇంటర్వ్యూల కోసం వేచి చూసేవారు...డబ్బులు చెల్లిస్తే తొందరగా ఇంటర్వ్యూ స్లాట్ దొరికేలా అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టనుందని తెలుస్తోంది. అయితే ఇందుకోసం 1000 డాలర్లు చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం. దీన్ని త్వరలోనే అమల్లోకి కూడా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపిందని సమాచారం.
నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులు, పర్యాటకులు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజుగా 1000 డాలర్లు చెల్లిస్తే.. వారికి వేగంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ప్రస్తుతం టూరిస్టు, నాన్ ఇమిగ్రెంట్ వీసాదారులు ప్రాసెసింగ్ ఫీజు కింద 185 డాలర్లను చెల్లిస్తున్నారు. డిసెంబర్ 2025లో పైలెట్ ప్రోగ్రామ్ గా ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌లోని లీగల్ సలహాదారులు.. ఈ ప్రతిపాదనపై చట్టపరమైన సమస్యలు ఉండొచ్చని ఆలోచిస్తున్నారు. ఖర్చుకు మించి ఫీజులు వసూలు చేయడం చట్ట విరుద్ధమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.