Protests in Iran : ఇరాన్‌లో ఆగని హింస...బలవుతున్న సామాన్యులు..చలి కాచుకుంటున్న ట్రంప్‌

ఇరాన్‌లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వంపై విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు.

New Update
FotoJet - 2026-01-14T122455.144

Khamenei vs trump

Protests in Iran : ఇరాన్‌లో అనూహ్యంగా పెరిగిన ధరలు, నిరుద్యోగం, ప్రభుత్వ అసమర్థ పాలనతో విసిగిపోయిన జనం నుంచి పెల్లుబికిన ఆగ్రహాగ్ని రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. జనం అసంఖ్యాకంగా వీధుల్లోకి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ వాణిజ్య సము దాయాలు, బ్యాంక్‌లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వాహనాలు, ఏటీఎంలకు నిప్పు పెడుతున్నారు. ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ హింసకు దారి తీశాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ (Human Rights Activists News Agency) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో కనీసం 2,571 మంది మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో 2,403 మంది ఆందోళనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు పేర్కొంది.

 ఆందోళనలతో సంబంధం లేని వారు కూడా ఈ హింసలో బలయ్యారు. ఇప్పటివరకు 12 మంది చిన్నారులు, 9 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించి 18,000 మందికి పైగా ఆందోళనకారులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వం నిరసనలను అణిచివేసేందుకు ప్రత్యక్ష కాల్పులు, టియర్ గ్యాస్, భారీగా అరెస్టులు చేపడుతున్నట్లు మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునేందుకు పలుమార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం కూడా జరిగిందని చెబుతున్నారు.ఉద్యమ వార్తలు, పుకార్ల వ్యాప్తిని అడ్డుకునేందుకు అయతొల్లా అలీ ఖమేనీ సారథ్యంలోని ఇరాన్‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, మొబైల్‌ సేవలను స్తంభింపజేసింది. అయితే నాలుగు రోజుల తర్వాత కొందరికి మాత్రం అంతర్జాతీయ ఫోన్‌కాల్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత రెండు వారాలుగా తాము పడుతున్న బాధలు, నరకయాతనను పలువురు విదేశాల్లోని తమ బంధువుల ముందు ఏకరవు పెట్టారు. సెంట్రల్‌ టెహ్రాన్‌లో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసులు మొహరించారని దుబాయ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని బంధువులకు వారు చెప్పారు.

ఉధృతంగా కొనసాగుతున్న ఆందోళనల ధాటికి దుకాణాలు మూతబ డుతున్నాయి. నిరంకుశ, ఛాందసవాద ఖమేనీ గద్దె దిగి ప్రజాస్వామ్యయుత పాలన కావాలంటూ వేలాదిగా జనం వీధుల్లో నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన ఖమేనీ సర్కార్‌ పోలీసులను రంగంలోకి దింపి లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగం, తప్పనిసరి పరిస్థితుల్లో తుపాకులకు పనిచెప్తోంది. సుప్రీంకమాండర్‌ ఖమేనీని దూషిస్తూ గత గురువారం జరిగిన నిరనస ర్యాలీలో పాల్గొన్న నేరానికి 26 ఏళ్ల ఉద్యమకారుడు ఇర్ఫాన్‌ సొల్తానీని బుధవారం ఉరితీస్తామని ఖమేనీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. అన్యాయంగా ఇర్ఫాన్‌ను ప్రభుత్వం బలితీసుకుంటోందని, అంతర్జాతీయ సమాజం ఈ దారుణాన్ని అడ్డుకోవాలని ‘హెంగ్వా ఆర్గనైజేషన్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’ సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. టెహ్రాన్‌ శివారు కరాజ్‌లోని ఫర్దీస్‌ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్‌ను జనవరి 8వ తేదీన పోలీసులు అరెస్ట్‌చేశారు. దేవునిపై యుద్ధం ప్రకటించాడని ఇర్ఫాన్‌పై నేరాభియోగాలు మోపి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎక్కువైంది. ఒక పౌరుడి ప్రాణాలు తీసేందుకు ఖమేనీ ప్రభుత్వం నిర్ణయాలు తీసు కుని  ఆగమేఘాల మీద అమలు చేయడం జీవితంలో ఎప్పుడూ చూడలేదని టెహ్రాన్‌వాసులు అసహనం వ్యక్తంచేశారు. ఇర్ఫాన్‌ను చివరిసారిగా కలిసేందుకు 11వ తేదీన కుటుంబసభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇర్ఫాన్‌ సోదరి స్వయంగా న్యాయవాది అయినా కూడా ఆమె ఈ కేసు వాదించకుండా ప్రభుత్వం అడ్డుకుంది. మరోవైపు ఇరాన్‌లో ఉంటున్న తమ పౌరులు తక్షణం ఆ దేశాన్ని వీడాలని అమెరికా మంగళవారం ఒక ప్రకటన జారీచేసింది.

నేనున్నా.. రెచ్చిపోండి: ట్రంప్‌

ఆందోళనలను మరింత రెచ్చగొట్టేలా ట్రంప్‌ మాట్లాడారు. ఈ మేరకు ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘ ఇరానియన్లు దేశ భక్తులు. నిరసనోద్యమాన్ని మరింత ఉధృతం చేయండి. రాజ్యాంగబద్ధ సంస్థలను మీ వశం చేసుకోండి. హంతకులు, దాడులు చేసే వారి పేర్లను రాసిపెట్టుకోండి. మనందరం కలిసి వాళ్ల అంతుచూద్దాం. దాడులకు వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. దారుణ హత్యోదంతాలు ఆగేదాకా ఇరాన్‌ ప్రభుత్వంతో నేను ఎలాంటి చర్చలు జరపబోను. అందుకే ఇరాన్‌ అత్యున్న తాధికారులతో అన్నిరకాల సమావేశాలను మంగళవారం రద్దు చేసుకున్నా. మీకు సాయం చేయబోతున్నాం. త్వరలోనే మీకు మా సాయం అందుతుంది. మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ ఎగేన్‌’’ అని ట్రంప్‌ రాసుకొచ్చారు. అయితే సాయం ఏ రూపంలో చేయబోతున్నారో ట్రంప్‌ వెల్లడించలేదు. అయితే అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌తో ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ చెప్పారు.  అదే సమయంలో ఇరాన్‌ పౌరులను ఉరితీస్తే తగిన గుణపాఠం చెప్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు