/rtv/media/media_files/2024/12/21/Sv4ONzuQwTVoVDUGezc4.jpg)
పాకిస్తాన్, అఫ్గాన్ తాలిబన్ల మధ్య వైరం రోజు రోజుకు ముదురుతోంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ పెరుగుతుండటంతో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్‌లో పాక్ ఆర్మీ తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ అనుసరిస్తున్న కొత్త వ్యూహం కారణంగా సైన్యం పల్లె ప్రాంతాల్లో చిక్కుకుపోయిన పరిస్థితి నెలకొంది. అఫ్గాన్ తాలిబాన్ 2021లో అమెరికా బలగాలు వైదొలగడానికి ముందు అనుసరించిన వ్యూహాన్నే టీటీపీ ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అమలు చేస్తోంది. మొదట పల్లె ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లి, ఆ తర్వాత నెమ్మదిగా పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించడం ఈ వ్యూహంలోని ప్రధాన అంశం. సరిహద్దుల్లోని వజీరిస్తాన్, బాజౌర్, ఖైబర్ కుర్రం వంటి మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాలపై టీటీపీ పూర్తి నియంత్రణ సాధించింది. ఈ ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం జోక్యం చేసుకోలేని విధంగా పరిస్థితి మారిపోయింది.
టీటీపీ పెరుగుతున్న బలం కారణంగా, సైనికులు ముఖ్యంగా పంజాబీ మూలాలున్నవారు, ఈ ప్రాంతాల్లో విధులు నిర్వహించడానికి నిరాకరిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గ్రామ ప్రాంతాల్లో పోరాడటం కష్టం కావడం, టీటీపీకి స్థానిక ప్రజల మద్దతు లభిస్తుండటంతో సైన్యం వెనకడుగు వేస్తోంది. ఫలితంగా, 'కాల్పులు జరిగితేనే తిరిగి కాల్పులు జరపడం' అనే రక్షణాత్మక విధానాన్ని మాత్రమే సైన్యం అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు సరిహద్దు దళాలు, పోలీసుల నియంత్రణలో ఉన్న బడబెర్, మట్టాని వంటి పట్టణ ప్రాంతాల్లోకి కూడా టీటీపీ చొచ్చుకుపోవడం పాక్ సైన్యాన్ని కలవరపెడుతోంది. ఈ ప్రాంతాల నుంచి టీటీపీ కార్యకలాపాలకు నిధులు సేకరిస్తూ, ఆయుధాలు, ఉగ్రవాదులను తరలిస్తోంది. టీటీపీ సభ్యులు బహిరంగంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, వాహనాలను తనిఖీ చేస్తున్న వీడియోలు కూడా బయటకు రావడం, ఆ ప్రాంతంపై వారి పట్టు ఎంత ఉందో స్పష్టం చేస్తోంది. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టీటీపీ దాడులతో పాకిస్తాన్ సైన్యం అనేక యుద్ధాల్లో చిక్కుకుంది. దేశంలో పెరుగుతున్న సైన్య వ్యతిరేక సెంటిమెంట్ కారణంగా, స్థానిక ప్రజలు సైన్యానికి బదులుగా టీటీపీకి మద్దతు తెలుపుతున్నారు. దీంతో ఈ ప్రాంతాలపై నియంత్రణ సాధించడం పాకిస్తాన్ సైన్యానికి రోజురోజుకూ కష్టమవుతోంది.
Follow Us