US revokes Indian visa: ట్రంప్ మరో షాక్.. భారతీయ వ్యాపారుల వీసాలు రద్దు

అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేసే భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, వారి కుటుంబ సభ్యుల వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.

New Update
indians visa

అమెరికాలో ట్రంప్ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా మాదక ద్రవ్యాలు రవాణా చేసే భారతీయ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, వారి కుటుంబ సభ్యుల వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది. ఇది ఫెంటనిల్ వంటి సింథటిక్ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని పేర్కొంది. డ్రగ్స్ అక్రమ రవాణా అడ్డుకొని తమ పౌరులను రక్షించుకోవడమే దీని ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది.

ఫెంటనిల్ అనేది హెరోయిన్ కంటే 50 రెట్లు ఎక్కువ శక్తివంతమైన సింథటిక్ ఓపియాయిడ్. అమెరికాలో ఈ ఫెంటనిల్ డ్రగ్ ఓవర్‌డోస్ మరణాలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచింది. ఈ డ్రగ్‌ను తయారు చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు అక్రమంగా భారత్ నుంచి సరఫరా అవుతున్నాయని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది.

ఈ నేప‌థ్యంలోనే, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్ 221(i), 212(a)(2)(C), 214(b) ప్రకారం ఈ వీసాలను రద్దు చేశారు. వీసాలు రద్దు అయిన వారిలో ఎగ్జిక్యూటివ్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అలాగే, ఫెంటనిల్ రసాయనాలకు సంబంధించిన వ్యాపారాల్లో భాగమైన కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేస్తే, వారి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

"మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడంలో యూఎస్ ఎంబసీ కట్టుబడి ఉంది. అక్రమంగా మత్తుపదార్థాల తయారీ, రవాణాలో పాలుపంచుకున్న వ్యక్తులు, సంస్థలు, వారి కుటుంబాలు అమెరికాలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాము" అని ఛార్జ్ డి అఫైర్స్ జోర్గన్ ఆండ్రూస్ పేర్కొన్నారు.

అమెరికా, భారత్ ప్రభుత్వాలు ఈ అంతర్జాతీయ ముప్పును ఎదుర్కొనేందుకు కలిసి పనిచేస్తాయని, దీని ద్వారా రెండు దేశాల ప్రజలను అక్రమ మాదకద్రవ్యాల నుంచి సురక్షితంగా ఉంచవచ్చని ఎంబసీ వివరించింది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ కేసులో నిందితులెవరో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ అంశంపై భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు