/rtv/media/media_files/2025/09/04/blood-moon-2025-09-04-15-27-52.jpg)
Longest Lunar Eclipse
Longest Lunar Eclipse: రేపు అనగా 7వ తేది ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2022 తర్వాత భారత్‌లో ఎక్కువ సేపు కనిపించే సంపూర్ణ చంద్రగ్రహణంగా ఇది నిలువనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. 2018 జూలై 27 తర్వాత మనదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించడం ఇదే మొదటిసారి కానుందని పుణెలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యా ఒబెరాయ్ వెల్లడించారు. మళ్లీ ఇలాంటిది చూడాలంటే 2028 డిసెంబరు 31 వరకూ వేచి ఉండాల్సిందే. ఈ నెల 7,8 తేదీల (ఆది, సోమవారం) మధ్య ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుందని తెలిపారు. ఆదివారంరాత్రి 8:58గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 8వ తేదీ తెల్లవారుజామున 2:25 గంటలకు చంద్ర గ్రహణం ముగుస్తుందని వెల్లడించారు.
ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ఆదివారం ఏర్పడనున్న రాహుగ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం శతబిషా నక్షత్రంలో ప్రారంభమవుతుంది. ఈ గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. సైన్స్ ప్రకారం ఎలా ఉన్నా.. జాతక రీత్య ప్రతి పనిపై గ్రహణ ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. కనుక గ్రహణకాలంలో ఏం చేయకూడదో తెలుసుకోవడం అవసరం.
సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభ సమయం రాత్రి 9.55 గంటలు కాగా, పూర్తయ్యే సమయం అర్ధరాత్రి 1.26గంటలు, మోక్షకాలం 11.41 గంటలు, మొత్తం 3.30గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుందని పండితులు తెలిపారు. గ్రహణ సమయానికి 2 గంటల ముందుగానే బోజనం చేయడం పూర్తి చేయాలని, రాత్రి 7.55గంటల్లోపే తినడం పూర్తి చేస్తే మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. గ్రహణం మర్నాడు (గ్రహణ శూల) సోమవారం ప్రయాణాలు పెట్టుకోవద్దని వెల్లడిస్తున్నారు. గ్రహణం ప్రారంభం కాగానే పట్టు స్నానం తప్పకుండా చేయాలని పండితులు సూచించారు. సరిగ్గా 9.55గంటలకు చన్నీళ్లతో మాత్రమే స్నానం చేయాలని పండితులు సూచించారు. అనారోగ్యం, ఇతర సమస్యలు ఉన్న వారు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలని చెపుతున్నారు. గ్రహణం రోజున తలంటు స్నానం చేయకుండా తలపై నీళ్లు పోసుకుని స్నానం పూర్తి చేయాలని, వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదని పండితులు తెలుపుతున్నారు.
గ్రహణ సమయంలో "దుంః దుర్గాయైనమః, ఓం చంద్రశేఖరాయ నమః, ఓం భగవతే రుద్రాయః" అని స్మరించడం, వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం చదవడం మంచిదని తెలిపారు. ఇక రజస్వల దోషం ఉన్న వారు సైతం గ్రహణం పట్టు స్నానం చేయాలని, బిడ్డ పుట్టిన వాళ్లు, ఇంట్లో అంటు, ముట్టు ఉన్నా గ్రహణ నియమాలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. అయితే పసి పిల్లలు, గర్భిణులు, వృద్ధులు గ్రహణ నియమాలు పాటించకున్నా పర్వాలేదని, కానీ, గర్భిణులు కచ్చితంగా చీకటి గదిలో కదలకుండా పడుకోవాలని సూచించారు. ఇక విడుపు స్నానం అర్ధరాత్రి చేయాల్సిన అవసరం లేదని, మర్నాడు చేసినా సరిపోతుందని పేర్కొన్నారు. సాధ్యమైనంత వరకు అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండాలని. విడుపు స్నానం చేసిన తర్వాత సోమవారం రోజున శివాలయానికి వెళ్లి దర్శించుకోవాలని చెప్పారు.
ఆలయానికి వెళ్లే భక్తులు తమ శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలని పండితులు తెలిపారు. వెండి , రాగి , ఇత్తడి లేదా పంచలోహ నాగ పడిగ, చంద్రబింబం దానం చేస్తే మంచిది. అదే విధంగా రాహువు అనుగ్రహం కోసం 1.25 కిలోల మినుములు, చంద్రుడి అనుగ్రహం కోసం 1.25 కిలోల బియ్యం దేవాలయంలో అర్చకులకు దానం చేయాలని సూచించారు. ఇంట్లో కూడా దానం చేసుకోవచ్చని, ఆవునెయ్యి , తెల్లని వస్త్రాలు దానం ఇచ్చుకుంటే మంచిదన్నారు. కుంభ, మీన రాశి వాళ్లు గ్రహణాన్ని అస్సలు వీక్షించవద్దని స్పష్టం చేశారు.
భారతదేశంపై కూడా ప్రభావం
ఈసారి చంద్రగ్రహణ వ్యవధి కాలం 3.30 గంటలు ఉంటుందని తెలుస్తోంది. రాత్రి 11.42 గంటలు గ్రహణ మధ్యస్థ కాలం. ఈసారి ఈ చంద్ర గ్రహణం ఆసియా ఖండంలోని చాలా దేశాల్లో కనపడే అవకాశం ఉంది. భారతదేశంపైన కూడా ఈ చంద్రగ్రహణం ప్రభావం ఉందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ గ్రహణం సమయంలో రాక్షస శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని పండితులు నమ్ముతారు. అందువల్ల అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.