/rtv/media/media_files/2025/08/21/pakistan-2025-08-21-19-48-11.jpg)
పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే కష్టాలు ఒంటరిగా రావు, గుంపులు గుంపులుగా వస్తాయి అనే సామెత గుర్తుకు వస్తుంది. మొదట ద్రవ్యోల్బణం పాక్ ను దుర్భరం చేసింది. ఆ తరువాత రాజకీయాలు శాంతిని హరించాయి. ఇప్పుడు వాతావరణం కూడా కరుణించలేదు. వరదల రూపంలో పాక్ ను కోలుకోలేకుండా చేసింది. వరదల కారణంగా 706 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లోనే 24 మంది మరణించారు. మృతులు కాకుండా, 965 మంది గాయపడ్డారు, దీంతో పాక్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో అత్యధిక విధ్వంసం జరిగింది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే 427 మంది ప్రాణాలు కోల్పోయారు.
దీని తరువాత పంజాబ్ (164 మరణాలు), సింధ్ (29 మరణాలు), బలూచిస్తాన్ (22 మరణాలు), పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (56 మరణాలు) ఇస్లామాబాద్ ప్రాంతంలో 8 మరణాలు సంభవించాయి. దీని అర్థం పాకిస్తాన్‌లో ఈ విపత్తు బారిన పడని మూల అంటు లేదు.దీంతో సైన్యం రంగంలోకి దిగాల్సి వచ్చింది. పాక్ సైన్యం ఇప్పటివరకు 6,903 మందిని రక్షించిందని ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి తెలిపారు. దీనితో పాటు 9 వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం ద్వారా గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. బునేర్ ప్రాంతంలో రెండు బెటాలియన్లు 24 గంటలూ పనిచేస్తున్నాయి. సహాయక సామాగ్రిని, ప్రజలను సురక్షితంగా చేరవేసే బాధ్యతను ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు తీసుకుంటున్నాయి.
Also Read : Crime News : ప్రియుడికోసం మరో భార్య దారుణం..భర్తను చంపి..
25 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు
ఇప్పటివరకు 25 వేల మందిని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు ఫెడరల్ సమాచార మంత్రి అట్టా ఉల్లా తరార్ పేర్కొన్నారు. NDMA, సైన్యం, అన్ని ప్రాంతీయ ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.అయితే, రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇటీవల సహాయక చర్యల్లో భాగంగా వెళ్తున్న ఒక హెలికాప్టర్ కూలిపోవడంతో ఐదుగురు సిబ్బంది మరణించారు. మరోవైపు రాబోయే 24 గంటలు అంత సులభం కాదని వాతావరణ శాఖ (PMD) తెలిపింది. పంజాబ్, ఇస్లామాబాద్, పెషావర్, సింధ్ లోని లోతట్టు ప్రాంతాలలో పట్టణ వరదలు, కాలువలు, నదులు పొంగిపొర్లడం వంటి ముప్పు ఉంటుందని హెచ్చరించింది.
పాకిస్తాన్‌లో ఎక్కువ వర్షపాతం
వాతావరణ మార్పుల కారణంగా పాకిస్తాన్‌లో అసాధారణంగా ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఈ వర్షాల తీవ్రత గత సంవత్సరాలతో పోలిస్తే 50 నుండి 60 శాతం అధికంగా ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) తెలిపింది. 2022లో కూడా పాకిస్తాన్‌లో భారీ వరదలు సంభవించి, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అంతేకాకుండా అనేక గ్రామాలు పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయాయి. వందలాది ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు, వంతెనలు కూలిపోయి సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.