Cambodia Hindu Deity Statue Demolition : థాయ్-కంబోడియా సరిహద్దు వివాదం.. హిందూ దేవుడి విగ్రహం కూల్చివేత

కంబోడియా - థాయ్‌లాండ్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్‌ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగంగా ఉంది.

New Update
FotoJet (5)

Cambodia Hindu Deity Statue Demolition

Cambodia Hindu Deity Statue Demolition: కంబోడియా - థాయ్‌లాండ్‌ మధ్య జరుగుతున్న సరిహద్దు వివాదం కూల్చివేతల వరకు వెళ్లింది. థాయ్‌ సైన్యం కంబోడియాలోని ఓ హిందూ దేవుడి విగ్రహాన్ని కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్కడి ప్రజలు హిందూ, బౌద్ధ దేవుళ్లను పూజిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ అన్నారు. నాగరిక వారసత్వంలో ఇదో భాగమని పేర్కొన్నారు. అలాంటిది హిందూ దేవుని విగ్రహాం కూల్చివేయడం వివాదానికి దారితీసింది.  

కాగా ఈ వివాదం ముగిసిపోయి.. శాంతి నెలకొనాలని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా నివారించాలని ఇరు దేశాలు చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని భారతదేశం కోరింది. ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు జూలైలో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఈ నెలలో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి.

థాయ్‌లాండ్ , కంబోడియా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే కంబోడియాలో ఉన్న హిందూ దేవతా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఇలాంటి అగౌరవమైన చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఇలాంటివి జరగకూడదని భారతదేశం స్పష్టం చేసింది.

వీడియోలు వైరల్‌

కాంబోడియాలో విష్ణు విగ్రహాన్ని బ్యాక్‌హో లోడర్‌తో కూల్చుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటనపై అంతర్జాతీయంగా తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. AFP నివేదిక ప్రకారం, కంబోడియా భూభాగంలో ఉన్న అన్ సెస్ ప్రాంతంలో ఈ విగ్రహం ఉండేదని, 2014లో దీనిని నిర్మించారని ప్రీయా విహార్ ప్రతినిధి లిమ్ చన్‌పన్హా తెలిపారు. ఈ విగ్రహం థాయ్ సరిహద్దుకు సుమారు100 మీటర్ల (328 అడుగులు) దూరంలో ఉందని చన్‌పన్హా చెప్పుకొచ్చారు.


నిరాశ్రయులుగా వేలాది మంది

సుదీర్ఘకాలంగా థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదం వల్ల రెండు దేశాల్లోనూ వేలాది మంది ఇళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ ప్రారంభంలో జరిగిన ఘర్షణల్లో 20 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య థాయ్‌లాండ్ పార్లమెంట్‌ను ఇటీవల రద్దు చేయడం కూడా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.

సరిహద్దు వివాదం నేపథ్యంలో..

కాగా థాయ్‌లాండ్, కంబోడియా మధ్య దాదాపు 800 కిలోమీటర్ల సరిహద్దు విషయంలో వందేళ్లుగా వివాదం నడుస్తోంది. తాజాగా విగ్రహం ఉన్న ప్రాంతం తమదంటే తమదని ఇరు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ఈ విగ్రహాన్ని 2014లో తమ భూభాగంలోనే నిర్మించామని, థాయ్ సైన్యం ఉద్దేశపూర్వకంగానే దీన్ని ధ్వంసం చేసిందని కంబోడియా ఆరోపించింది. ఇది తమ భూభాగమని, సరిహద్దు ఒప్పందాల ప్రకారం వివాదాస్పద ప్రాంతాల్లో శాశ్వత కట్టడాలు ఉండకూడదనే కారణంతో థాయ్ సైన్యం విగ్రహాన్ని తొలగించింది.

కాల్పుల విరమణ విఫలం

ఈ సరిహద్దు ఘర్షణల్లో ఇప్పటికే దాదాపు 80 మందికి పైగా మరణించగా, వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడంతో ఘర్షణలు మళ్లీ మొదలయ్యాయి. మతపరమైన చిహ్నాలను రాజకీయ, సరిహద్దు వివాదాల్లోకి లాగడం వల్ల అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో భారత్ చేసిన వ్యాఖ్యలు ఆగ్నేయాసియా దేశాలపై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.

కాగా, ఇరుదేశాల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో మతపరమైన చిహ్నలను ద్వంసం చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి. ఇది కేవలం రాజకీయ ఉద్దేశంతో కూల్చివేశారా? లేక మతపరమైన కారణాలతో కూల్చివేశారా అనే కోణంలో విచారణ చేపట్టాలని పలువురు కోరుతున్నారు. కాగా విగ్రహాల కూల్చివేత ఇదే తొలిసారా? లేక ఇది వరకు ఇలాంటి ఘటనలు ఏవైనా జరిగాయా అనే విషయంలో అంతర్జాతీయ హిందూ సంఘాలు ఆరా తీస్తున్నాయి. కాగా ఈ కూల్చివేత దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారడంతో ఈ విషయం సర్వత్రా చర్చనీయంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు