అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరికొస్తున్న నేపథ్యంలో కమలా హారిస్‌ పూర్వికుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి. హారిస్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆమె అమెరికా అధ్యక్షురాలిగా గెలవాలని స్థానికులు పూజలు చేస్తున్నారు.

New Update
TN

మరో మూడురోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ మధ్య గట్టి పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే కమలా హారిస్‌ పూర్వికుల గ్రామమైన తమిళనాడులోని  తిరువరూర్ జిల్లా తులసేంద్రపురంలో సంబరాలు జరుగుతున్నాయి. హారిస్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఆమె అమెరికా అధ్యక్షురాలిగా గెలవాలని స్థానికులు పూజలు చేస్తున్నారు.  

Also Read: నో షేవ్ నవంబర్ అంటే ఏంటో తెలుసా?

తమిళనాడుకు ఎలా సంబంధం

ఇక వివరాల్లోకి వెళ్తే.. కమలా హారిస్‌ తమిళనాడు మూలాలున్న భారత సంతతి మహిళ. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. శ్యామల తండ్రి గోపాలన్ తిరువరూర్ జిల్లా తులసేంద్రపురంలో జన్మించారు. ఆయన కేంద్ర ప్రభుత్వ అధికారిగా వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. హరీస్ తల్లి శ్యామల ఉన్నత చదువుల కోసం కాలిఫోర్నియాకు వెళ్లారు. అక్కడ రొమ్ము క్యాన్సర్‌పై పరిశోధనలు చేశారు. జమైకాకు చెందిన డొనాల్డ్‌ హరీస్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. వీళ్లకు జన్మించిన తొలి సంతానమే కమలా హారిస్. అయితే తన బాల్యంలో ఉన్నప్పుడు ఇండియాలో అమ్మమ్మ, తాతయ్యలను కలిశానని ఇటీవల హారిస్ ఎక్స్ వేదికగా తెలిపారు.   

ప్రస్తుతం డెమోక్రాటిక్ అభ్యర్థిగా హారిస్ అధ్యక్ష బరిలో ఉన్నందున ఆమె గెలవాలని స్థానికులు పూజలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీస్ పోటీ చేయడం తమకు ఎంతో గర్వంగా ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక 2014లో హారిస్ బంధువులు ఆమె పేరు మీద ఆ ఊరిలో 300 ఏళ్ల నాటి గుడికి విరాళం అందించారు.  

Also Read: జార్ఖండ్‌ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు

కమలా హారిస్‌ పేరు కూడా గుడి శిలాఫలకాలపై ఉంది. హారిస్ గౌరవార్థంగా స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్‌కు కూడా ఆమె పేరు పెట్టడం విశేషం. అంతేకాదు త్వరలోనే ఆ గ్రామంలో నిర్మించే బస్‌స్టాప్‌కు కూడా ఆమె పేరే పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తమ ఊరి మూలాలున్న వ్యక్తి అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టాలని అక్కడి స్థానికులు కోరుతున్నారు.  గతంలో కూడా ఆమె ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు ఆమె గెలవాలని తులసేంద్రపురంలో పూజలు చేశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు