2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ తర్వాత.. ఆ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రపంచంలో ఏ దేశం కూడా వాళ్ల పాలనను అధికారికంగా గుర్తించలేదు. అయితే తాలిబాన్‌ను ఉగ్ర సంస్థల జాబితా నుంచి తొలగించాలని రష్యా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రష్యా విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయంపై తాలిబన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2003లోనే రష్యా తాలిబన్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. 2021లో అఫ్ఘానిస్థాన్ తాలిబాన్ల చేతిలోకి వెళ్లిపోయాక.. కేవలం చైనా, యూఏఈ దేశాలు మాత్రమే తాలిబన్‌ల రాయబారులను అంగీకరించాయి. ఇంకా ఏ దేశాలు కూడా వారి పాలనను గుర్తించలేదు.
Also Read: పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్..
ఇటీవల రష్యా.. తాలిబాన్లతో సంబంధాలు కొససాగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది జులైలో ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాలిబన్ ఉద్యమాన్ని ఉగ్రవాదంపై పోరులో భాగంగానే చూస్తామని వెల్లడించారు. ఆఫ్గానిస్థాన్ ప్రభుత్వంతో తాము ఆచరణాత్మక సంప్రదింపులు జరిపే అవసరం ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు. ఆ దేశంతో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాలు కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొన్నారు. అయితే తాజా నిర్ణయం వాస్తవరూపం దాల్చేందుకు చట్టపరమైన పలు రూల్స్ పాటించాల్సి ఉందని అఫ్గాన్ వ్యవహారాలు చూసే రష్యా ప్రతినిధి తెలిపారు.