Russia drone strikes: వామ్మో.. ఒక్క నెలలోనే 6,000పైగా డ్రోన్ దాడులు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమై గత మూడేళ్లుగా కొనసాగుతోంది. డ్రోన్ దాడుల తీవ్రత ఇటీవల కాలంలో ఊహించని విధంగా పెరిగింది. రష్యా ఒకే నెల(జూలై)లో 6,297 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు.

New Update
drone sadassu

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమై గత మూడేళ్లుగా కొనసాగుతోంది. డ్రోన్ దాడుల తీవ్రత ఇటీవల కాలంలో ఊహించని విధంగా పెరిగింది. రష్యా ఒకే నెల(జూలై)లో 6,297 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడులు చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వెల్లడించారు. జూన్‌తో పోలిస్తే దాదాపు 16 శాతం ఎక్కువ. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాది జులైలో 14 రెట్లు ఎక్కువ డ్రోన్లు ప్రయోగించినట్లు మరో నివేదిక తెలిపింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలు, కీలక మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యంగా మారాయి.

జూలై 9న ఒక్క రాత్రిలోనే రష్యన్‌ ఆర్మీ రికార్డు స్థాయిలో 728 డ్రోన్లు, 13 క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌లోని సుమీ, దొనెట్స్క్, ఖేర్సన్ రీజియన్‌లలో ఎనిమిది మంది మరణించారు. అలాగే జులై 31న కీవ్‌పై జరిపిన దాడిలో ఐదుగురు చిన్నారులు సహా 31 మంది మృతి చెందారు. మరో 159 మంది గాయపడ్డారు.

జూలై నెలలో రష్యా ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లు, గ్లైడ్ బాంబుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఉక్రెయిన్ రక్షణ వర్గాలు తెలిపాయి. గత వారం రోజుల్లోనే రష్యా 1,270కి పైగా డ్రోన్లు, 39 క్షిపణులు, 1,000కు పైగా శక్తివంతమైన గ్లైడ్ బాంబులను ప్రయోగించిందని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గాయపడ్డారు. ముఖ్యంగా, కీవ్ రాజధానిపై రష్యా చేసిన దాడుల్లో పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోవడం విషాదకరం.

రష్యా కేవలం సైనిక స్థావరాలనే కాకుండా పౌరులు నివసించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ దాడుల వల్ల అనేక భవనాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. రష్యా రాత్రి వేళల్లో డ్రోన్ దాడులు చేయడం వల్ల వాటిని గుర్తించడం, అడ్డుకోవడం ఉక్రెయిన్ గగనతల రక్షణ వ్యవస్థకు సవాలుగా మారింది.

ఈ భీకర దాడులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే, ఈ స్థాయిలో దాడులు జరుగుతుండటంతో ఉక్రెయిన్ దేశం మరింత సైనిక సహాయం కోసం అమెరికా, యూరోప్ దేశాల వైపు చూస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెరుగుతున్న డ్రోన్ దాడుల తీవ్రత, పౌరులపై వాటి ప్రభావం ప్రపంచ శాంతికి పెను సవాలుగా పరిణమించింది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, డ్రోన్ దాడుల పరంపర ఎప్పుడు ఆగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది.

Advertisment
తాజా కథనాలు