Block Everything: మరో నేపాల్‌లా మారుతున్న ఫ్రాన్స్.. వేలాది మంది రోడ్లపైకి

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 'బ్లాక్ ఎవ్రీథింగ్' నినాదంతో ఆందోళనకారులు రోడ్లు, రైల్వే మార్గాలను దిగ్బంధించారు. దీంతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.

New Update
Block Everything

ఫ్రాన్స్ రాజధాని పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు వెల్లువెత్తాయి. 'బ్లాక్ ఎవ్రీథింగ్' నినాదంతో ఆందోళనకారులు రోడ్లు, రైల్వే మార్గాలను దిగ్బంధించారు. దీంతో దేశంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. నిరసనకారులు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలను తగులబెట్టడం, రహదారులపై అడ్డంకులు సృష్టించడం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఇప్పటివరకు సుమారు 200 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ నిరసనలకు ప్రధాన కారణం కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకార్ను నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఆర్థిక సంస్కరణలే. పెన్షన్ల తగ్గింపు, పన్నుల పెంపు వంటి కఠినమైన విధానాలను ప్రభుత్వం అమలు చేయనుందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో నిరుద్యోగం, పెరుగుతున్న జీవన వ్యయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కొత్త విధానాలు వారిపై మరింత భారాన్ని మోపుతాయని వారు భయపడుతున్నారు.

పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రభుత్వం 80 వేల మంది పోలీసు బలగాలను మోహరించింది. అనేక చోట్ల పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనల్లో వందలాది మంది అరెస్ట్ అయ్యారని, మరికొంతమంది గాయపడ్డారని సమాచారం.

'బ్లాక్ ఎవ్రీథింగ్' ఉద్యమం సోషల్ మీడియా, ఎన్‌క్రిప్టెడ్ చాట్‌ల ద్వారా ప్రారంభమై, అనతికాలంలోనే దేశవ్యాప్తంగా వ్యాపించింది. దీనికి ఎలాంటి నిర్దిష్ట నాయకత్వం లేకపోవడం వల్ల నిరసనకారులను నియంత్రించడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. గతంలో జరిగిన 'యెల్లో వెస్ట్స్' ఉద్యమాన్ని ఈ నిరసనలు గుర్తు చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆర్థిక విధానాలపై ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి ఈ ఆందోళనలు అద్దం పడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఏ దిశగా మారుతుందో చూడాలి.

Advertisment
తాజా కథనాలు