/rtv/media/media_files/2025/08/29/daruma-2025-08-29-22-58-43.jpg)
PM Modi
అమెరికాతో వాణిజ్య యుద్ధం జరుగుతున్న వేళ భారత ప్రధాని మోదీ జపాన్, చైనా పర్యటనలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తన వాణిజ్యాన్ని మరింత విస్తరించుకునే దిశగా ఈ రెండు పర్యటనలూ ఉపయోగపడనున్నాయి. దాంతో పాటూ చైనాలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పుతిన్, జిన్ పింగ్, ప్రధాని మోదీ కలిసి చర్చించనున్నారు. అమెరికాకు, ట్రంప్ కు చెక్ పెట్టే దిశగా ఇవి ఉంటాయని అంచనా. ఇప్పటి వరకు భారత ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు భారత్ ఆ దేశంపై ఇక ఆధారపడకూడదని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా తమ వ్యాపారాన్ని జపాన్, చైనా, రష్యా, యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలకు విస్తరించనున్నారు.
చంద్రయాన్ 5 కు ఇరు దేశాలు..
ఇందులో భాగంగా జపాన్ తో భారత్ కీలక భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంది. చంద్రుడి మీద పరిశోధనలు చేసే చంద్రయాన్ 5 కు ఆ దేశంతో కలిసి పని చేయనుంది. దీని కోసం ఇరు దేశాల అంతరిక్ష సంస్థలూ కలిసి పని చేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. దీంతో పాటూ ఆర్థిక సహకారం, ఆరోగ్యం, ఏఐ, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాల ప్రధానులు ఈ పర్యటనలో చర్చించుకున్నారు. జపాన్ తో కలిసి పని చేయడం వలన లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకునే వీలు కలుగుతుందని ప్రధాని మోదీ చెప్పారు.
మోదీకి జపాన్ అరుదైన కానుక..
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీ వరుసగా ముఖ్యులతో భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అక్కడి ఓ ఆలయ పూజారిని కూడా కలిశారు. ఈ సందర్భంగా పూజారి మోదీకి దరూమా డాల్ ను కానుకగా అందించడం ఆకర్షణగా నిలిచింది. దరూమా డాల్ ను జపాన్ వాసులు పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు ఇది ప్రధానికి ఇవ్వడం ఇరు దేశాల మధ్యా సుహృద్భావానికి ప్రతీక అని చెబుతున్నారు.
జపాన్ సంప్రదాయంలో దరూమా డాల్ అదృష్టం, పట్టుదలకు చిహ్నంగా భావించే బొమ్మ. ఎరుపు,నలుపు రంగులతో ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చాన్ బౌద్ధమత స్థాపకుడిగా పేర్కొనే బోధిధర్మ ఆధారంగా దీన్ని రూపొందించినట్లు చెబుతారు. బోధిధర్మ ఇండియా నుంచే జపాన్ కు వెళ్ళారని చెబుతారు. దరూమా డాల్ బౌన్సింగ్ బాల్ రూపంలో ఉంటుంది. కిందకు నెట్టినా పైకి లేస్తుంది. ఏడుసార్లు కిందపడినా ఎనిమిదోసారి లేచి నిలబడాలనే అర్థం వచ్చే ఓ జపనీస్ సామెతను ప్రతిబింబిస్తుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు. ఈ బొమ్మ రెండు కళ్లు తెలుపు రంగులోనే వదిలేసి ఉంచుతారు. కొనుక్కున్నప్పు అలానే ఉంటుంది. కొనుగోలు చేసిన వ్యక్తి ఏదైనా కోరిక లేదా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. మొదట ఆ బొమ్మ ఎడమ కన్నును నల్లటి సిరాతో నింపాలి. ఆ కోరిక లేదా లక్ష్యం నెరవేరినప్పుడు మాత్రమే కుడి కన్నును సిరాతో పూర్తిచేయాలి.