Pakistan Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. సైనిక పాలనలోకి పాకిస్తాన్‌!

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు.

New Update
Pakistan Army Chief

అమెరికాతో చమురు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. తమ దేశంలో అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీస్తే పాకిస్తాన్ అప్పులు తీరుతాయని, ఆర్థికంగా సంపన్న దేశాల జాబితాలో చేరుతుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో, సైనిక తిరుగుబాటుకు సంబంధించిన ఊహాగానాలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జంగ్ మీడియా గ్రూప్ కాలమిస్ట్ సుహైల్ వారైచ్‌తో మాట్లాడుతూ, తాను రాజకీయంగా ఎటువంటి ఆకాంక్షలు పెట్టుకోలేదని, కేవలం దేశ రక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు.

"దేవుడు నన్ను ఈ దేశానికి రక్షకుడిగా చేశాడు. నాకు ఆ పదవి తప్ప మరే ఇతర పదవిపైనా ఆసక్తి లేదు," అని మునీర్ చెప్పినట్లు వారైచ్ తన కాలమ్‌లో రాశారు. "నేను ఒక సైనికుడిని, నా గొప్ప కోరిక అమరుడు కావడమే" అని కూడా మునీర్ అన్నట్లు పేర్కొ్న్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. గత కొద్ది రోజులుగా పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని తొలగించి, మునీర్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారనే ఊహాగానాలు విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. "ఆపరేషన్ సింధూర్" తర్వాత మునీర్ కు 'ఫీల్డ్ మార్షల్' హోదా లభించడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఈ పుకార్లను ఖండించారు. ఈ పుకార్లు రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు.

పాకిస్తాన్‌కు సైనిక పాలన కొత్తేమీ కాదు. 1947లో ఏర్పడినప్పటి నుంచి, ఆ దేశం దాదాపు 34 ఏళ్ల పాటు సైనిక పాలనలో ఉంది. 1958లో అయూబ్ ఖాన్, 1977లో జియా-ఉల్-హక్, 1999లో పర్వేజ్ ముషారఫ్ తిరుగుబాట్ల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. మునీర్ వ్యాఖ్యలు, అధికారిక ప్రకటనలు ఈసారి సైన్యం ప్రజాస్వామ్య వ్యవస్థకు కట్టుబడి ఉంటుందని సూచిస్తున్నాయి. కానీ, పాకిస్తాన్ చరిత్రను గమనిస్తే, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. మునీర్ వ్యాఖ్యలు సైన్యం రాజకీయాల్లోకి జోక్యం చేసుకోదని స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజలు మాత్రం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.

మునీర్ తన వ్యాఖ్యల్లో ముఖ్యంగా బలూచిస్తాన్‌లోని 'రేకో డిక్' మైనింగ్ ప్రాజెక్టును ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఏడాది నుంచి ఏటా కనీసం 2 బిలియన్ డాలర్లు ఆదాయం వస్తుందని, రాబోయే సంవత్సరాల్లో ఇది మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌లో రేర్ ఎర్త్ ఖనిజాలు ఉన్నట్లు గతంలో కూడా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు ఆర్మీ చీఫ్ స్వయంగా ప్రకటించడం ఆ దేశ భవిష్యత్తుపై కొత్త ఆశలను రేకెత్తించింది. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో చమురు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. పాకిస్థాన్‌కు భారీ చమురు నిల్వలు ఉన్నాయని, వాటిని వెలికి తీయడానికి తాము సహకరిస్తామని ట్రంప్ అన్నారు. ఈ ప్రకటన తర్వాత మునీర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఈ ఖనిజ సంపద బలూచిస్తాన్‌లోని వేర్పాటువాదుల ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతంపై పాకిస్థాన్ సైన్యం ఆధిపత్యం పెరిగితే, మానవ హక్కుల ఉల్లంఘనలు పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. మరోవైపు, అమెరికా కూడా చైనాపై ఆధారపడకుండా, రేర్ ఎర్త్ ఖనిజాల కోసం ఇతర దేశాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్-అమెరికా మధ్య పెరుగుతున్న సహకారం కేవలం చమురు ఒప్పందానికే పరిమితం కాదని, రేర్ ఎర్త్ ఖనిజాలపై కూడా దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు భారత్‌కు ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు