/rtv/media/media_files/2025/10/22/jihadi-course-2025-10-22-14-38-30.jpg)
పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మహిళల కోసం స్పెషల్‌గా ఆన్‌లైన్‌లో 'జిహాదీ కోర్సు'ని ప్రారంభించింది. ఈ కోర్సు ఫీజు పాకిస్థాన్ కరెన్సీలో 500 రూపాయలుగా పెట్టారు. ఈ చొరవకు సంబంధించి నిఘా వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమాత్ ఉల్-ముమినత్ పేరుతో జైష్-ఎ-మొహమ్మద్ కొత్తగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఆధ్వర్యంలోనే 'తుఫత్ అల్-ముమినత్' అనే పేరుతో ఆన్‌లైన్ కోర్సును నవంబర్ 8 నుండి ప్రారంభించడానికి సిద్ధమైంది. దీని ప్రధాన లక్ష్యం మహిళలను ఉగ్రవాద సిద్ధాంతాల వైపు ఆకర్షించడం, సంస్థలోకి నియమించుకోవడం. జైష్ చీఫ్ మసూద్ అజార్ చెల్లెలు సాదియా అజార్ ఈ మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం.
UN-designated terror group Jaish-e-Mohammed (JeM), Sponsored by #Pakistan, has launched a new online jihadi course named “Tufat al-Muminat” to recruit women into its newly created female brigade – Jamat ul-Muminat.
— Shivank Mishra (@shivank_8mishra) October 22, 2025
Under this 40-minute daily online course starting 8 November,… pic.twitter.com/otUFZl9I6t
ఈ కోర్సులో భాగంగా రోజూ 40 నిమిషాల సెషన్‌లు ఉంటాయి. ఇందులో జిహాద్ కోణంలో ఇస్లాంలో మహిళల కర్తవ్యాల గురించి బోధిస్తారు. మసూద్ అజార్ కుటుంబ సభ్యులు, ఇతర సీనియర్ కమాండర్ల బంధువులైన మహిళలే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, బహవల్‌పూర్, కరాచీ వంటి ప్రాంతాలలోని మతపరమైన కేంద్రాల్లో చదువుతున్న మహిళలను లక్ష్యంగా చేసుకొని ఈ నియామకాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో దీన్ని నిర్వహించడం వలన, ముస్లిం కట్టుబాట్ల కారణంగా బయటకు రాలేని మహిళలను కూడా ఆకర్షించడం సులభమవుతుందని సంస్థ భావిస్తోంది.
ఈ కోర్సుకు ఆర్థిక వనరులు సేకరించడానికి ఫీజు లేదా విరాళంగా రూ.500 సేకరిస్తోంది. అలాగే జైష్ -ఎ -మొహమ్మద్ వంటి పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు కొత్త పద్ధతుల్లో నిధులు సేకరిస్తున్నాయని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ నిబంధనలకు కట్టుబడి ఉన్నామని చెప్తున్నప్పటికీ, ఉగ్రవాద సంస్థలు కొత్త ముసుగులో కార్యకలాపాలను, నిధుల సేకరణను కొనసాగిస్తున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.
సాంప్రదాయకంగా మహిళలను సాయుధ దాడులకు దూరంగా ఉంచిన జైష్, ఇప్పుడు ఈ కొత్త విభాగం ద్వారా రిక్రూట్‌మెంట్, ప్రచార కార్యకలాపాలలో మహిళలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఈ పద్ధతి ఐఎస్ఐఎస్, హమాస్ వంటి ఇతర ఉగ్రవాద సంస్థల మాదిరిగానే ఉంది. మహిళలను ఉపయోగించడం ద్వారా భద్రతా తనిఖీల్లో సులభంగా దాటవేయవచ్చని, లాజిస్టిక్స్, ప్రచార కార్యకలాపాలను నిర్వహించవచ్చని జైష్ నాయకత్వం భావిస్తున్నట్లు కౌంటర్-టెర్రర్ అధికారులు అంచనా వేస్తున్నారు. జైష్ వ్యూహంలో ఈ మార్పు భద్రతా పరంగా మరింత ఆందోళన కలిగిస్తోంది.