BREAKING: నేపాల్ తాత్కాలిక ప్రభుత్వంలోకి ముగ్గురు కొత్త మంత్రులు

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం మంత్రివర్గం విస్తరించింది. కొత్తగా ముగ్గురు మంత్రులను కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రధానితో సహా నలుగురు సభ్యులు ఉన్నారు. రామేశ్వర్ ఖనాల్, ఓం ప్రకాష్ ఆర్యల్, కుల్మాన్ ఘిసింగ్‌లు నేడు మంత్రులుగా బాధ్యలు చేపట్టారు.

New Update
Nepal interim cabinet

నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం మంత్రివర్గం విస్తరించింది. కొత్తగా ముగ్గురు మంత్రులు కేబినెట్‌లోకి తీసుకున్నారు. వీరితో కలిపి ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి సహా నలుగురు సభ్యులు ఉన్నారు. ఇటీవల జరిగిన హింసాత్మక నిరసనలు కారణంగా నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దేశంలో సోషల్ మీడియా నిషేధం, అవినీతికి వ్యతిరేకంగా జెడ్ జనరేషన్ యువత నిరసనలకు దిగారు. అది హింసాత్మకంగా మారి 70 మందికి పైగా మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. తర్వాత ఈ దేశంలో పార్లమెంట్ రద్దు చేసి.. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. కాఠ్మండులోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఈ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 

రామేశ్వర్ ఖనాల్:

ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఖనాల్‌కు ఆర్థిక రంగంలో మంచి అనుభవం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఈ నియామకం దోహదపడుతుందని భావిస్తున్నారు.

కుల్మాన్ ఘిసింగ్: 
ఇంధనం, జల వనరులు, నీటిపారుదల మంత్రిగా నియమితులయ్యారు. ఈయన నేపాల్ విద్యుత్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేసి, దేశంలో విద్యుత్ కోతలను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషించారు. ఘిసింగ్‌కు భౌతిక మౌలిక సదుపాయాలు, రవాణా, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖలను కూడా అదనంగా కేటాయించారు.

ఓం ప్రకాష్ ఆర్యల్: 
హోం మంత్రిగా, అలాగే న్యాయ, న్యాయ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్యల్ ప్రముఖ న్యాయవాది. యువత నేతృత్వంలో ఇటీవల జరిగిన ఆందోళనల తర్వాత, యువత ప్రతినిధులు, ప్రధానమంత్రి, పార్టీ నాయకుల మధ్య జరిగిన చర్చల్లో ఆర్యల్ కీలక పాత్ర పోషించారు. ఈయన హోం మంత్రిగా శాంతిభద్రతల పునరుద్ధరణకు కృషి చేస్తారని భావిస్తున్నారు.

ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని సుశీలా కర్కి తన కేబినెట్‌ను విస్తరించారు. దేశంలో సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి, వివిధ వర్గాలలో విశ్వాసం నింపడానికి ఈ నియామకాలు సహాయపడతాయని ఆమె కార్యాలయం వెల్లడించింది. రాబోయే రోజుల్లో మరికొంత మంది మంత్రులను కేబినెట్‌లో చేర్చుకుంటామని ప్రధాని కర్కి తెలిపారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంటు ఎన్నికలు నిర్వహించనుంది.

Advertisment
తాజా కథనాలు