Nobel Peace Prize: అన్న మాట నిలబెట్టుకున్న మచాదో..నోబెల్ ప్రైజ్ ట్రంప్ కు అందజేత

వెనెజువెలా విపక్ష నేత మరియా మచాదో అన్నట్టుగానే చేశారు. తన నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అందజేశారు. తమ దేశ క్షేమం కోసం ఆయన కృషి చేస్తున్నందుకే ఇచ్చానని తెలిపారు. 

New Update
ma chado-trump

గత ఏడాది నోబెల్ శాంతి పురస్కారం విషయంలో చాలా హంగామానే జరిగింది. అమెరికా అధ్యక్షుడు ఆ ప్రైజ్ తనకు రావాలని ఎన్ని ప్రయత్నాలు చేశారో అందరికీ తెలిసిందే. ఎనిమిది యుద్ధాలను ఆపానని...అన్ని విధాలా తాను నోబెల్ శాంతి బహుమతికి అనుర్హుడునని చెప్పుకున్నారు. అయితే ట్రంప్ కు మాత్రం అది దక్కలేదు. వెనెజువెలా విపక్ష నేత మరియా కోరీనా మచాదోకు అది దక్కింది.  అప్పటి నుంచి ఆమె ఆ బహుమతికి అమెరికా అధ్యక్షుడు అర్హుడని చెబుతూనే ఉన్నారు. తరువాత వెనెజువెలా అధ్యక్షుడు మదురో అరెస్ట్ అయిన తర్వాత కూడా తన నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్ కు ఇస్తానని ప్రకటించారు. 

నోబెల్ ను ట్రంప్ కు అందజేసిన మచాదో..

ఈ రోజు మరియా మచాదో వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశారు. మధ్మాహ్నం లంచ్ తర్వాత తనకు వచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ఆయనకు అందజేశారు. దాంతో పాటూ ఆయన గొప్ప వ్యక్తని...అలాంటి అధ్యక్షుడిని ప్రజలు పూర్తిగా నమ్మవచ్చని చెప్పారు. అలాగే తమ దేశ క్షేమం కోసం ట్రంప్ చేసిన కృషిని మచాదో కొనియాడారు. అందుకు గుర్తుగానే నోబెల్ ను ఆయనకు అందజేశానని తెలిపారు. ఇక మచాదో, ట్రంప్ సమావేశంలో వెనెజువెలా భవిష్యత్తు గురించి చర్చించుకున్నారు. తమ దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం ట్రంప్‌పై ఆధారపడొచ్చని మచాదో అన్నారు. అయితే ట్రంప్ ఆ పతకాన్ని అంగీకరించారో లేదో మాత్రం తెలియలేదు. మరోవైపు శాంతి బహుమతిని అలా మనకు నచ్చిన వారికి బదిలీ చేయలేమని నోబెల్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. 

మదురో అరెస్ట్ వెనుక ఆమె?

నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి మచాదో బయటకు రాలేదు. ఆమె చాలా రోజులుగా అండర్ గ్రౌండ్ లో ఉన్నారు. బహుమతి ప్రదానం రోజు కూడా ఆమె రాలేకపోయారు. మచాదో బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని వెనెజువెలా ప్రభుత్వం చెప్పడమే అందుకు కారణం. అయితే తరువాత అమెరికా సహాయంతో మచాదో దేశాన్ని దాటి వచ్చారు. దీని కోసం అమెరికా ప్రత్యేక సైనిక ఆపరేషన్ ను కూడా నిర్వహించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత  వెనెజువెలా అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారు.  ఆయన అరెస్ట్ వెనుక మచాదో హస్తం ఉందని సమాచారం. ఇక  
నిరంకుశ పాలన, రాజకీయ సంక్షోభంలో పోరాడుతున్న వెనిజులా దేశంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం వాదించినందుకు 2025లో మచాడోకు నోబెల్ శాంతి బహుమతి లభించింది.

Advertisment
తాజా కథనాలు