/rtv/media/media_files/2025/10/29/indian-origin-businessman-murdered-in-canada-2025-10-29-09-45-34.jpg)
Indian-origin businessman murdered in Canada
Darshan Singh Sahsi: కెనడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, 'కానమ్ ఇంటర్నేషనల్' అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ (68)ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బ్రిటిష్ కొలంబియాలోని అబాట్స్‌ఫోర్డ్‌లో ఆయన నివాసం బయటనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి బయట కారులో కూర్చుంటున్న సమయంలో ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది.
విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులపై దాడులు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా కెనడాలో మరో భారత సంతతి వ్యాపారవేత్తపై దారుణం చోటుచేసుకుంది. కానమ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ కాల్పుల్లో మరణించారు.అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 9:22 గంటలకు రిడ్జ్‌వ్యూ డ్రైవ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, కారులో ఉన్న సాహ్సీ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆయనకు ప్రథమ చికిత్స సిబ్బంది వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, విచారణ ప్రాథమిక దశలో ఉందని సార్జెంట్ పాల్ వాకర్ తెలిపారు. కేసును అబాట్స్‌ఫోర్డ్ మేజర్ క్రైమ్ యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని మూడు పాఠశాలలకు కొద్దిసేపు షెల్టర్-ఇన్-ప్లేస్ ప్రోటోకాల్ అమలు చేశారని తెలిపారు.
కాగా దర్శన్ సింగ్ సాహ్సీ పంజాబ్‌లోని లుధియానా జిల్లా, రాజ్‌గఢ్ గ్రామానికి చెందినవారు. రైతు కుటుంబానికి చెందిన ఆయన 1991లో కెనడాకు వలస వెళ్లి, వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్, ప్రపంచంలోని అతిపెద్ద క్లాతింగ్ రీసైక్లింగ్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయన గుజరాత్‌లోని కాండ్లాలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు. సాహ్సీ ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. తన సంస్థలో ఎక్కువ మంది పంజాబీలకు ఉపాధి కల్పించారు.
చంపింది మేమే.. కాగా, కెనడాలో భారత వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సహాసి హత్య బిష్ణోయ్ గ్యాంగ్ పనే అని తేలింది. పంజాబ్‌కు చెందిన దర్శన్‌ను సోమవారం ఇంటి బయట కాల్చి చంపిన విషయం తెలిసిందే. కాగా ఆయనను చంపిందే తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. ఈ మేరకు బిష్ణోయ్ గ్యాంగ్‌లో సభ్యుడైన గోల్దీ ధిల్లాన్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. సహాసి మాదకద్రవ్యాల వ్యాపారంలో భాగమయ్యాడని ఆరోపించాడు. అతని వద్ద నుంచి తాము డబ్బు డిమాండ్ చేశామని.. అది అందకపోవడంతో చంపేశామని పేర్కొన్నాడు.
Follow Us