/rtv/media/media_files/2025/10/29/russian-oil-2025-10-29-22-57-20.jpg)
Russian oil Tanker
రష్యా, ఉక్రెయిన్ కు మధ్య యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దానికి తోడు రష్యాపై ఆయన ఆగ్రహంగా కూడా ఉన్నారు. ఎంత చెప్పినా తన మాట వినడం లేదని..యుద్ధాన్ని ఆపడం లేదని ట్రంప్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రష్యన్ ఆయిల్ కంపెనీలపై ఆంక్షలను విధించారు. దీని ప్రభావం ఇప్పుడు భారత్ పైనా కనిపిస్తోంది. రష్యా నుంచి ఇండియాకు అవుతున్న చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఆ దేశ ముడిచమురుతో భారత్ వైపు వస్తోన్న ట్యాంకర్ మార్గమధ్యలో యూటర్న్ తీసుకుని.. బాల్టిక్ సముద్రంలో నిలిచిపోయింది. రష్యన్ నౌక ఫ్యూరియా తన దిశను మార్చుకుంది. ఈ ట్యాంకర్ డెన్మార్క్, జర్మనీ మధ్య ఉన్న జలసంధిలో పశ్చిమం వైపుగా వెళ్తోంది. ప్రస్తుతం భారత ముడి చమురు దిగుమతుల్లో మూడో వంతు రష్యా నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలు విధించిన రెండు రష్యన్ చమురు దిగ్గజాలలో ఒకటైన రోస్నెఫ్ట్ నుంచి ఈ నౌక వస్తోంది. షిప్-ట్రాకింగ్ ప్లాట్‌ఫారమ్‌లు Kpler, Vortexa నుండి సేకరించిన డేటా ప్రకారం.. అక్టోబర్ 20న రష్యన్ బాల్టిక్ ఓడరేవు అయిన ప్రిమోర్స్క్ నుండి ఫ్యూరియా 730,000 బారెల్స్ ఉరల్స్ ముడిను లోడ్ చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ నౌక గమ్యస్థానాన్ని ముందుగా గుజరాత్‌లోని సిక్కా ఓడరేవుగా గుర్తించారు.
రష్యా బయట ఆస్తుల విక్రయం..
రష్యా (Russia) సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకాయిల్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల నుంచి అమెరికా కంపెనీలు, వ్యక్తులు చమురు కొనకుండా అక్టోబరు 22న అగ్రరాజ్యం నిషేధం విధించింది. అమెరికాయేతర సంస్థలు కొనుగోలు చేసినా, పెనాల్టీ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. ఈ రెండు సంస్థలతో కొనసాగుతున్న లావాదేవీలను నవంబర్ 21 నాటికి ముగించాలని స్పష్టం చేసింది. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో రష్యన్ లుక్ ఆయిల్ సంస్థ కీలక చర్యలను చేపట్టింది. అంతర్జాతీయంగా ఉన్న సంస్థ ఆస్తులను విక్రయించే పనిలో పడింది. దీనికి సంబంధించి కొనుగోలుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 21లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని లుక్ ఆయిల్ భావిస్తోంది. అలా కాని పక్షంలో అమెరికాను మరి కొంత సమయం అడిగే ఆలోచనలో ఉందని చెబుతున్నారు.రష్యాకు చెందిన లుక్‌ఆయిల్ సంస్థకు 11 దేశాల్లో చమురు, గ్యాస్ ప్రాజెక్టుల్లో వాటాలు ఉన్నాయి. బల్గేరియా, రొమేనియాలో చమురు శుద్ధి కర్మాగారాలు ఉండడంతోపాటు నెదర్లాండ్స్‌లోని రిఫైనరీలో 45శాతం వాటా ఉంది. ఇవి కాకుండా చాలా దేశాల్లో గ్యాస్ స్టేషన్లు, వాటిల్లో భాగస్వామ్యాలు కూడా ఉన్నాయి. ట్రంప్ ఆంక్షలు మూలంగా వీటన్నింటిలో వ్యాపారం చేయడం ఆ సంస్థలకు కష్టంగా మారింది. మరో ఆయిల్ కంపెనీ రోస్ట్ నెస్ట్ కూడా ఇలాంటి కష్టాలనే ఎదుర్కోంటోందని తెలుస్తోంది.
Follow Us