/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
Trump
అమెరికా దిగుమతులపై భారీ సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాటి అమలుపై గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికి సంబంధించి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. టారీఫ్ ల వలన అమెరికా ఆర్థికంగా బాగుపడుతోందని...ఇప్పుడు వాటిని ఆపేస్తే తీవ్ర నష్టం వస్తుందని భయపెడుతున్నారు. సుంకాలకు వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వస్తే 1929 తరహా మహా మాంద్యానికి దారి తీస్తుందని హెచ్చరించారు.
అమెరికా సర్వనాశనమే..
ప్రతీకార సుంకాలు అమెరికన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని ట్రంప్ అంటున్నారు. టారీఫ్ ల సానుకూల ప్రభావంతో స్టాక్ మార్కెట్లు రోజూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో యూఎస్ దేశ ఖజానా వందల కోట్ల డాలర్ల ఆదాయం చూస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఆర్ధికంగా అమెరికా ఎదుగుతోంది. ఇలాంటి టైమ్ లో టారీఫ్ లను అడ్డుకుంటే..సంపద సృష్టి ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడితే చాలా నష్టం జరుగుతుంది. అమెరికా డిప్రెషన్ లో కూరుకుపోతుంది. 1929 తరహాలో సర్వనాశనం అయిపోతుంది జాగ్రత్త అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో హెచ్చరించారు. తమ దేశానికి కనుక ఈ పరిస్థితి వస్తే కోలుకోవడం చాలా కష్టమని...ఎటువంటి మార్గం కూడా లేదని చెబుతున్నారు. సుంకాల కేసుకు సంబంధించి అమెరికా కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పు నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాలు దేశీయ తయారీని ప్రోత్సహిస్తాయని, ఆదాయ పన్నులకు ప్రత్యామ్నాయంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు వాదిస్తున్నారు.