ఇజ్రాయెల్‌ చేతిలో హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా హతం! ఎవరీ నజ్రల్లా

ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. హెజ్‌బొల్లా చీఫ్‌ నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళం శనివారం ఎక్స్‌ వేదికగా ప్రకటించింది. అతని కూతురు కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ నస్రల్లా ఎవరో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
Nasralla

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. పాలస్తీనాకు అనుకూలంగా ఉంటూ.. ఇరాన్‌ నుంచి మద్దతు ఉన్న హెజ్‌బుల్లా సంస్థను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్‌ హసన్‌ నస్రల్లాను టార్గెట్ చేసి లెబనాన్ రాజధాని బీరుట్‌లోని హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై శుక్రవారం దాడులు చేసింది. దీంతో నస్రల్లా చనిపోయాడని ఇజ్రాయెల్ భద్రతా దళాలు శనివారం ఎక్స్‌ వేదికగా అధికారికంగా వెల్లడించాయి. హసన్‌ నస్రల్లా ఇకపై ప్రంపంచాన్ని భయపెట్టలేడంటూ రాసుకొచ్చింది. మరోవైపు నస్రల్లా కుమార్తె జైనబ్‌ కూడా మరణించారనే వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఇంతకీ నజ్రల్లా ఎవరు అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.      

షేక్ హసన్ నస్రుల్లా ఎవరు?

గత 30 ఏళ్లుగా హెజ్‌బుల్లా ఆర్గనైజేషన్‌కు హసన్ నజ్రుల్లా అధ్యక్షత వహిస్తున్నాడు. మిడిల్‌ ఈస్ట్‌లో ఉన్న మిలిటెంట్‌ గ్రూపుల్లో హెజ్‌బుల్లాను బలమైన మిలిటెంట్‌గా తయారుచేయడంలో అతడు కీలక పాత్ర పోషించారు. 1960, ఆగస్టు 31న లెబనాన్‌లోని బీరుట్‌ శివారు ప్రాంతమైన బుర్జ్‌ హమ్ముద్‌లోని ఓ షియా కుటుంబంలో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి చిన్న కూరగాయాల వ్యాపారం చేసేవాడు. తొమ్మిది మంది తోబుట్టువుల్లో నస్రల్లా ఒకడు. చిన్నప్పుడు ఇతను మత విద్యను అభ్యసించాడు. టైర్ అనే పట్టణంలో తన విద్యాభ్యాసం చేసిన నస్రల్లా 16 ఏళ్లకే షియా రాజకీయ పార్టీ, పారామిలిటరీ గ్రూప్ అయిన 'అమల్‌ ఉద్యమం'లో చేరాడు. అతని భార్య పేరు ఫాతిమా యాసిన్‌. ఈ దంపతులకు నలుగురు పిల్లలు.1997లో ఇజ్రాయెల్‌ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీ మృతి చెందాడు. 

1980లో ఇజ్రాయెల్‌.. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (PLO)ను నిర్మూలించడమే లక్ష్యంగా దాడులు చేసింది. బీరుట్‌ నుంచి పీఎల్‌ఓను విజయవంతంగా తరిమికొట్టింది. దీంతో పీఎల్‌ఓలో ఉన్న కొంతమంది సభ్యులు ఎలాగైనా ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు. ఇందుకోసం 1982లో జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌ ప్రధాన కార్యాలయంపై దాడులు చేశారు. ఈ ఘటనలో 91 మంది ఇజ్రాయెల్ అధికారులు మృతి చెందారు. షియా ఇస్లామిస్టులు ఈ దాడికి తామే పాల్పడ్డామని ప్రకటించారు. చివరికి వాళ్లందరూ కలిసి హెజ్‌బొల్లా అనే మరో ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఏర్పాటులో నస్రల్లా సైతం కీలక పాత్ర పోషించాడు. 

Also Read: హరికేన్‌ విధ్వంసం..30 మంది మృతి!

1992లో అప్పటి హెజ్‌బొల్లా అధినేత అబ్బాస్ అల్‌ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ భద్రతా దళాలు హతమార్చాయి. దీంతో హెజ్‌బొల్లా పగ్గాలు నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే కావడం గమనార్హం. అతడి నాయకత్వంలోనే ప్రస్తుతం హెజ్‌బొల్లా ఒక బలమైన మిలిటెంట్‌ గ్రూప్‌గా అవతరించింది. నస్రల్లా హెజ్‌బొల్లాను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్‌ ప్రభుత్వంలో కూడా కీలక భాగస్వామిగా మార్చేశాడు. ఈ సంస్థ ప్రభావాన్ని ఇతర దేశాలకు కూడా విస్తరించాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ హెజ్‌బొల్లానే సాయం చేసింది. 

20 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్‌బొల్లా భీకర పోరాటం చేసింది. ఆ తర్వాత నస్రల్లా పేరు అరబ్‌ దేశాల్లో మారుమోగిపోయింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. అప్పుడు ఇజ్రాయెల్‌ను ఓడించడంలో నస్రల్లా కీలక పాత్ర పోషించాడు. అప్పటినుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు. ఇటీవల ఇజ్రాయెల్‌, హమాస్ మధ్య యుద్ధం మొదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో నస్రల్ మృతి చెందినట్లు.. ఇజ్రాయెల్ భద్రతా దళం (IDF) అధికారికంగా ప్రకటించింది. కానీ హెజ్‌బుల్లా మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. 

Also Read: ఓ వైపు ప్రసంగం..మరో వైపు దాడులు!

అతని కూతురు జైనబ్‌ కూడా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె మృతిని హెజ్‌బొల్లా గాని.. లెబనాన్ గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఒకవేళ నస్రల్లాతో పాటు అతని కూతురు జైనబ్ మృతి చెందితే హెజ్‌బొల్లా దాడులు మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. లేదా ఇజ్రాయెల్‌కు హెజ్‌బొల్లా లొంగిపోయే అవకాశం కూడా లేకపోలేదు. హెజ్‌బొల్లా చీఫ్‌ మృతితో ఆ సంస్థ బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌కు లొంగిపోతుందా లేదా మళ్లీ తిరుగుబాటు చేస్తుందా అనేది చర్చనీయాంశమవుతోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు