భారత్‌లోకి చైనా చొరబాట్లు.. POKలో డ్రాగన్ కంట్రీ నిర్మాణాలు

భారత్-పాకిస్తాన్-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న షాక్స్‌గామ్ లోయలో చైనా సైన్యం రోడ్లు నిర్మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. PoKలోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

New Update
Chinese incursions

భారత్-పాకిస్తాన్-చైనా మధ్య వివాదాస్పదంగా ఉన్న షాక్స్‌గామ్ లోయలో చైనా బలగాలు రహదారిని నిర్మించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ (PoK) లోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో చైనా రహదారి నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అంతరిక్ష ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ రోడ్డు నిర్మాణం వెల్లడైంది. భారత్‌కు చెందిన నిఘా విశ్లేషకులు ఈ రోడ్డు నిర్మాణాన్ని గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు.

షాక్స్‌గామ్ లోయ లడఖ్‌లోని సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. చారిత్రకంగా ఇది జమ్మూ మరియు కశ్మీర్ రాచరిక రాష్ట్రంలో భాగంగా ఉంది. 1963లో, భారత్-చైనా యుద్ధం తర్వాత పాకిస్తాన్ తన ఆధీనంలో ఉన్న ఈ లోయను చైనాకు అక్రమంగా అప్పగించింది. అప్పటి నుండి భారత్ ఈ ఒప్పందాన్ని ఏ మాత్రం గుర్తించడం లేదు. ఈ లోయ ఇప్పటికీ భారత్ సార్వభౌమ భూభాగంలో అంతర్భాగమని భారత ప్రభుత్వం పదే పదే స్పష్టం చేస్తోంది. 2024 జూలైలో కూడా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. పాకిస్తాన్ అక్రమంగా ఈ ప్రాంతాన్ని చైనాకు ఇచ్చిందని ఆయన విమర్శించారు.

తాజాగా, చైనా నిర్మిస్తున్న ఈ రహదారి అఘిల్ పాస్ గుండా వెళుతూ, ఆక్సాయి చిన్ రహదారి (G219)కి కలుస్తుంది. ఇది చైనాకు ఈ వివాదాస్పద ప్రాంతంలోకి లాజిస్టిక్ యాక్సెస్ పెంచుకోవడానికి తోడ్పడుతుంది. సియాచిన్ గ్లేసియర్‌కు ఈ రోడ్డు చాలా దగ్గరగా ఉండటం వల్ల భారత భద్రతా దళాలకు ఇది ఒక పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ నిర్మాణాల ద్వారా చైనా ఈ ప్రాంతంపై తన పట్టును మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.

రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ నిర్మాణాలు కేవలం ప్రాదేశిక సార్వభౌమత్వ ఉల్లంఘన మాత్రమే కాదని, వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంట ఉన్న పరిస్థితులను మార్చడానికి చైనా చేస్తున్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని అంటున్నారు. చైనా తన సైనిక, లాజిస్టిక్ నియంత్రణను విస్తరించుకోవడానికి వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ, తన "సలామి-స్లైసింగ్" వ్యూహాన్ని అమలు చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. 

Advertisment
తాజా కథనాలు