Explainer: ICE ఏజెంట్లు ఎవరినైనా కల్చి చంపొచ్చా? ట్రంప్ కొత్త టీమ్ తో అమెరికాలో హైటెన్షన్.. అసలేం జరుగుతోంది?

అమెరికాలోని మిన్నెసోటాలో మహిళను ఐసీఈ కాల్చి చంపడం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ సంఘటనపై అక్కడ చాలా రాష్ట్రాల్లో నిరసన వ్యక్తం అవుతోంది. అసలేంటీ ఐసీఈ...దీనికి ఇన్ని అధికారాలు ఎవరిచ్చారు?

New Update
Good

అమెరికా(america) మిన్నెసొటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో దారుణం జరిగింది. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌(United States Immigration and Customs Enforcement) (ICE) అధికారి మంగళవారం ఓ మహిళను కాల్చిచంపడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మంగళవారం ICE అధికారులు మినయాపోలిస్‌లో సోదాలు చేశారు. ఈ క్రమంలోనే 37 ఏళ్ల రీని నికొల్ గుడ్‌ అనే మహిళ ప్రయాణిస్తున్న కారును ICE అధికారులు అడ్డుకునేందుకు యత్నించారు. కానీ ఆమె ఆపకుండా ముందుకు దూసుకెళ్లింది. దీంతో ఓ అధికారి కాల్పులు జరిపగా.. ఈ కాల్పుల్లో నికొల్ గుడ్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఎవరు ఏం చెబుతున్నారు?

నికొలస్ గుడ్ ను ఐసీఈ చంపడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గుడ్ ను తాము ఊరకనే అలా కాల్చి చంపలేదని...రోజంతా ఆమె ఐసీఈ అధికారులను వెంబడిస్తూ..తన కారుతో వారి మార్గాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని..అధికారులపై అరుస్తూ వారి విధులకు భంగం కలిగించారని...అందుకే తాము ఆమెను నియంత్రించడానికి ప్రయత్నించామని..అందులో భాగంగానే  చంపాల్సి వచ్చిందని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి చెబుతున్నారు. ఐసీఈ అధికారిని కారు కింద తొక్కేందుకు ప్రయత్నించి, ఆయనను చంపాలని లేదా తీవ్రంగా గాయపరచాలని ప్రయత్నించారని, ఇది దేశీయ ఉగ్రవాద చర్యకు సమానమని అన్నారు. ఐసీఈ అధికారి తన ప్రాణాలకు ముప్పు ఉందని భావించి, ఆత్మరక్షణ చర్యగా కాల్పులు జరిపారని నోయం చెప్పారు.కానీ గుడ్ ను చంపిన వీడియో ఇంటర్నెట్ లో షేర్ అయిన దానిని చూసిన వారందరూ..గుడ్ అసలేమీ చేయలేదని కేవలం తప్పించుకుని వెళుతుంటే ఐసీఈ అధికారులు కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. ఆమెను అన్యాయంగా అధికారులు చంపేశారని నిరసనలకు దిగుతున్నారు.

అధికారులను సపోర్ట్ చేస్తున్న ట్రంప్..

ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కారు నడిపిన మహిళ అత్యంత అస్తవ్యస్తంగా ప్రవర్తించారు. అధికారుల పనిని అడ్డుకున్నారు, ప్రతిఘటించారు. ఆమె ఒక ఆందోళనకారిణి అని అభివర్ణించారు. హింసాత్మకంగా, ఇష్టారాజ్యంగా ఐసీఈ అధికారిపై వ్యవహరించారని చెప్పారు. అయితే నగర మేయర్ మాత్రం కాల్పులు జరిపిన ఐసీఈ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు.ఒక వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైనది ఆ ఏజెంట్ అధికార దుర్వినియోగమే" అని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి ఇలా విభిన్న స్వరాలతో గుడ్ మరణం విషయం ప్రస్తుతం చాలా గొడవకే దారి తీస్తోంది. కొన్ని రాష్ట్రాలు మినహా..దాదాపు అమెరికాలో అన్ని రాష్ట్రాలూ ఐసీఈ అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. 

అసలేంటీ ఐసీఈ...దీనికి మనుషులను చంపే అధికారం ఉందా? 

ఐసీఈ అంటే.. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్. ఇది అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ లోని ఒక ముఖ్యమైన దర్యాప్తు సంస్థ. వలస చట్టాలను అమలు చేస్తూ..సరిహద్దు బాధ్యతలను చూసుకోవడం ఈ డిపార్ట్ మెంట్ విధి. దేశంలో చట్టవిరుద్ధంగా ఉన్న వలసదారులను గుర్తించి..వారిని పంపించేయడంలో వీరే కీలకంగా వ్యవహరిస్తారు. గత ఏడాదిగా అమెరికాలో ట్రంప్ యంత్రాంగం అక్రమ వలసదారులపై ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. దేశం మొత్తం మీద ఉన్న ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ను వెతికి వెతికి మరీ ఏరి పారేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఐసీఈ నే కీలకంగా వ్యవహరిస్తోంది.  ఎక్కడ పడితే అక్కడ ప్రత్యక్షమై సోదాలు, దాడులను నిర్వహిస్తోంది. రోడ్లపై, షాపింగ్స్ లో ఉన్న వ్యక్తులను కూడా ఆపి మరీ వారు అమెరికన్ పౌరులేనా కాదా తెలుసుకుంటూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. లాస్ ఏంజెలెస్ లాంటి చోట్ల సడెన్ తనిఖీలు నిర్వహించి...అక్కడి నిరసనలు కూడా కారణమైంది ఈ డిపార్ట్ మెంట్ వారే. 

అయితే ఈ ఐసీఈకు ఎవరినైనా శిక్షించే లేదా చంపే హక్కు ఉందా అంటే...దాదాపు లేదనే చెప్పాలి. మామూలుగానే అమెరికాలో చాలా రాష్ట్రాల చట్టాల ప్రకారం పోలీసులు లేదా ఇతర అధికారులు తమను తాము తీవ్రమైన హాని నుంచి రక్షించుకునేందుకు మాత్రమే బలప్రయోగం చేయవచ్చును. తమపై చాలా పెద్ద దాడి జరిగితేనే ఇతరులను చంపవచ్చును. ఐసీఈ కు కూడా ఇంచుమించుగా ఇలాంటి అనుమతులే ఉన్నాయి. వీరు ఎక్కడైనా, ఎవరినైనా ఎలాంటి చోటనైనా తనిఖీలు చేయవచ్చును. కానీ శిక్షించే, చంపే అధికారం మాత్రం చాలా పరిమితంగానే ఉంటుంది.   

వీరిపై కేసు పెట్టవచ్చునా?

మిన్నెసోటాలో ప్రస్తుతం జరిగిన సంఘటనలో ఐసీఈ అధికారులు నికొలస్ గుడ్ ను అన్యాయంగా కాల్చి చంపారని చెబుతున్నారు. ఆమె చాలా మంచి వ్యక్తని, మంచి రచయితని స్థానికులు వివరిస్తున్నారు. అనవసరంగా గొడవలకు దిగే వ్యక్తిత్వం ఆమెకు లేదని అంటున్నారు. అలాగే ఆమెను కాల్చి చంపిన ప్రత్యక్ష వీడియోలో కూడా ఐసీఈ అధికారులు చెబుతున్నట్టు ఎక్కడా లేదని...అసలు ఆమె వారిపై కారు పోనివ్వలేదని...కేవలం వారి నుంచి తప్పించుకోవడానికి మాత్రమే ప్రయత్నించారని అంటున్నారు. మొత్తం అంతా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని...ఇందులో తప్పంతా ఐసీఈ అధికారులదేనని ఆరోపిస్తున్నారు. అన్యాయంగా అమాయక ప్రజలను చంపే హక్కు ఐసీఈకు లేదని వాదిస్తున్నారు. 

అయితే ఎవరేమన్నా, ఎన్ని నిరసనలు జరిగినా...ఐసీఈ అధికారులపై కేసు పెట్టడం చాలా కష్టం. ఎందుకంటే అమెరికా చట్టాల ప్రకారం అక్కడి పెడరల్ అధికారులు తమ విధుల్లో భాగంగా ఎటువంటి చర్యలు చేసినా కేసుల నుంచి రక్షణ పొందుతారు. ఒకవేళ సంఘటన జరిగిన మిన్నెసోటా రాష్ట్రం తన సొంత చట్టాలను అనుసరించి వారిపై కేసు పెట్టినా కూడా దానిని ఐసీఈ అధికారులు ఫెడరల్ చట్టానికి మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. అక్కడకు వెళ్ళాక రాష్ట్రాలు ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఫెడరల్ కోర్టు ఐసీఈ అధికారి తప్పు చేశాడని భావించా కూడా..వారికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేదు. తమ విధుల్లో భాగంగా తాము ఆ చర్యకు పాల్పడ్డామని అధికారులు వాదించే అవకాశం ఉంటుంది. ఒకసారి రాష్ట్ర లేదా ఫెడరల్ కోర్టు కేసు కొట్టేస్తే మళ్ళీ దాని మీద ఎవరూ అప్పీల్ చేయడానికి వీలు కూడా లేదు. లేదూ ఐసీఈ అధికారిపై రాష్ట్రం లేదా కేసు పెట్టిన వారు ఎవరైనా గెలవాలంటే...ఆ అధికారి తన విధులను దుర్వినియోగం చేశారని...అది స్పష్టంగా చట్ట విరుద్ధమైన పని అని నిరూపించాల్సి ఉంటుంది. చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆధారాలతో సహా చూపెట్టాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఫెడరల్ అధికారులపై సివిల్ కేసు లేదా చనిపోయిన వారి తాలూకా వారు కూడా కేసు వేయలేరు. ఒకవేళ అలా వేసినా కూడా పెద్దగా ఏమీ చేయలేరు. అధికారి స్పష్టంగా రాజ్యాంగ హక్కును ఉల్లంఘించాడని నిరూపించాలి. అలా చేసినా కూడా మహా అయితే విధుల నుంచి తొలగిస్తారు. అంత కంటే ఏమీ చేయలేరు. 

ఇలాంటి కేసు ఇంతకు ముందుందా?

ఇలా ఫెడరల్ అధికారికి ఎప్పుడైనా శిక్ష పడిందా అంటే...2020లో జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ను కాలితో తొక్కి చంపిన పోలీసు అధికారికి శిక్ష పడింది. ఆ కేసులో పోలీసు అధికారి చాలా క్లియర్ గా తన విధులను, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించాడని నిరూపితమైంది. ఆ పోలీసు అధికార చాలా క్రూరంగా ప్రవర్తించాడని తేలింది. దీంతో కోర్టు అతనికి 22 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. అతనితో పాటూ ఉన్న మరో ముగ్గురు పోలీసులు అధికారులకు మాత్రం పెద్దగా శిక్షలు పడలేదు. 


 

Advertisment
తాజా కథనాలు