/rtv/media/media_files/2025/08/14/trump-putin-2025-08-14-07-39-20.jpg)
Trump, Putin
రష్యా, ఉక్రయెన్ యుద్ధం ముగింపు చర్చల్లో భాగంగా మరో రెండు రోజుల్లో ట్రంప్, పుతిన్ భేటీ అవుతున్నారు. అలస్కాలో యాంకోరేజ్ లోని సైనిక స్థావరంలో ఇది జరగనుంది. ఇరు నేతలూ ఈ ప్రాంతాన్ని సమావేశం కోసం ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు రష్యా భూభాగమైన అలస్కాను ఆ దేశం అమెరికాకు అతి చౌకగా అమ్మేసింది. ఇక్కడ నుంచి చూస్తూ రష్యా కనిపిస్తుందని స్థానికులు చెబుతారు. దీంతో అలస్కా ఇరు దేశాలకు భౌగోళికంగా, వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనది. ఈ ప్రాంతాన్ని ఇంతకు ముందు చాలా మంది ప్రపంచ నేతలు పర్యటించినప్పటికీ.. తొలి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ నిలువనున్నారు.
అలస్కాను ఎందుకు అమ్మేసింది?
ఒకప్పుడు తన భూభాగమైన అలస్కాను రష్యా 1867లో అమెరికాకు అమ్మేసింది. అలస్కా పర్చేజ్'గా పేరుపొందిన ఈ ఒప్పందం రష్యా జార్ అలెగ్జాండర్-2, అమెరికా తరపున నాటి విదేశాంగ శాఖ మంత్రి విలియం హెచ్. సేవార్డ్ మధ్య జరిగింది. దీన్ని 7.2 మిలియన్ డాలర్లకు రష్యా అమ్మేసింది. ఈ భూభాగం అమెరికాకు చాలా ముఖ్యమైనది. దీంతో యూఎస్ తన దేశాన్ని భౌగోళికంగా విస్తరించుకుంది.
అలస్కా..రష్యాకు మారు మూలన ఉంటుంది. క్రిమియన్ యుద్ధం కారణంగా రష్యా 1853-56 మధ్య కాలంలో ఆర్థికంగా చాలా బలహీనపడింది. దీని కారణంగా అలస్కా లాంటి మారుమూల ప్రదేశాలను పోషించే పరిస్థితుల్లో రష్యా లేదు. అందుకే ఆ సమయంలో ఆ దేశం అలస్కాను అతి తక్కవు ధరకు అమ్మేసింది. అప్పట్లో రష్యాకు బ్రిటన్ శత్రు దేశంగా ఉండేది. అలస్కా బ్రిటిష్ కొలంబియా పక్కనే ఉంది. దీంతో దానిపై ఆ దేశం ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉంది. దాని నుంచి కాపాడుకునే సామర్ధ్యం రష్యాకు లేదు. అలాంటి సమయంలో అలస్కాను కోల్పోవడం కంటే అమెరికాను అమ్మేస్తే కనీసం డబ్బులు అయినా వస్తాయని ఆలోచించింది. అందుకే అమ్మేసింది.
అలస్కాను అమ్మేడానికి మరో కారణం ఇది చాలా పెద్దది. మొత్తం 5,86, 412 చదరపు మైళ్ళను కలిగి ఉంటుంది. అంటే అమెరికాలోని మూడు పెద్ద రాష్ట్రాలైన టెక్సాస్, కాలిఫోర్నియా, మొంటానాలను కలిపిన దాని కన్నా పెద్దగా ఉంటుంది. పైగా ఇక్కడ రెవెన్యూ జనరేషన్ చాలా తక్కువ. అలస్కాలో ప్రధాన వ్యాపారం జంతువుల వేట, వాటి నుంచి వచ్చే బొచ్చు. అయితే కంటిన్యూగా జంతువుల వేట చేయడంతో అవి బాగా తగ్గిపోయాయి. దీంతో వాణిజ్యం బాగా దెబ్బ తింది. అసలే డబ్బులు లేకుండా ఉన్న రష్యాకు ఇది కూడా పెద్ద తలనొప్పిగా మారింది. ఈ కారణం వలన కూడా అలస్కాను వదిలించుకోవడం సరైందిగా భావించి ఆ ప్రాంతాన్ని అమెరికా చేతుల్లో పెట్టింది. అలస్కాను అమ్మడం వల్ల ఉత్తర అమెరికా ప్రాంతం నుండి రష్యా పూర్తిగా తప్పుకున్నట్లయింది. మరోవైపు అమెరికాకు దీని వలన పసిఫిక్ ప్రాంతంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఒక అవకాశం అయింది.