స్విట్జర్లాండ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. అమెరికాకి చెందిన 64 ఏళ్ల మహిళ 'ఆత్మహత్యా పేటిక' (సూసైడ్ పాడ్) సాయంతో ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమెకు సహకరించిన పలువురు వ్యక్తులను దక్షిణ స్విట్జర్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు పెట్టారు. ఎవరైన తమ ఇష్టంతో చనిపోవాలనుకునేందుకు వినియోగించే ఈ సూసైడ్ పేటికను సార్కో అని అంటారు. ఇప్పటివరకు దీని సాయంతో ఎవరూ ఆత్మహత్య చేసుకోలేదు. ఇప్పుడు ఈ సార్కో సాయంతో ఇష్టపూర్వకంగా ఆత్మహత్య చేసుకున్న మొదటి వ్యక్తిగా ఆ మహిళ నిలిచింది.
Also Read: కమలా హారిస్ ప్రచార కార్యాలయం పై కాల్పులు!
స్విట్జర్లాండ్-జర్మనీ సరిహద్దు సమీపంలో ఉన్న మెరిషౌసెన్ అనే ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆమెను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. సార్కోలో ఒక మనిషి పట్టేంత స్థలం ఉంటుంది. అందులోకి ఒక వ్యక్తి వెళ్లగానే.. మీట నొక్కితే ఆ పేటికలోని నైట్రోజన్ గ్యాస్ విడుదల అవుతుంది. దీంతో లోపల ఉన్న వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే ఊపిరాడక ప్రాణాలు కోల్పోతాడు. అయితే సార్కోని ఉపయోగించి మొదటిసారిగా ఓ మహిళ సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది.