/rtv/media/media_files/2026/03/06/iran-war-2026-03-06-15-57-34.jpg)
A Chronological Timeline of Major Events from Feb 28 to March 6 in Iran VS usa, israel war
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. గత ఏడు రోజుల నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై, చమురు, గ్యాస్ కేంద్రాలపై దాడులు చేస్తోంది. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఇరాన్‌లో దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాలపాలయ్యారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధం మొదలయ్యి దాదాపు వారం రోజులు అవుతుంది. అప్పటినుంచి ఈరోజు వరకు జరిగిన ప్రధాన సంఘనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఖమేనీ మరణం
ఫిబ్రవరి 28న అమెరికా "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ", ఇజ్రాయెల్ "ఆపరేషన్ రోరింగ్ లయన్" పేర్లతో ఇరాన్‌పై మెరుపు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనువడు కూడా మృతి చెందారు. అంతేకాదు ఇరాన్‌ను చెందిన అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలపై కూడా వందలాది దాడులు జరిగాయి.
మార్చి 1న ఖమేనీ మరణించినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌పై, అలాగే గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడింది.
ఎంబసీ, చమురు, గ్యాస్ ప్లాంట్లపై దాడులు
ఇక మార్చి 2న సోమవారం కువైట్‌లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడులు చేసింది. ఈ ఘటనలో ఎంబసీ కంపౌండ్‌లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత అధికారులు ఎంబసీని మూసివేశారు. అదేరోజున సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారమైన రాస్ తనూరా పై ఇరాన్ డ్రోన్‌లతో మెరుపు దాడులు చేసింది. సౌదీ రక్షణ దళాలు ఇరాన్ ప్రయోగించిన రెండు డ్రోన్‌లను అడ్డుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వాటి శిథిలాలు ప్లాంట్‌పై పడి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఈ ఘటన తర్వాత ఆ రిఫైనరీని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి ఆగిపోయింది. అలాగే ఖతార్‌లోని రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై కూడా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు (LNG) ప్లాంట్‌పైనే ఈ దాడి జరిగింది. దీంతో ఖతార్ ఎనర్జీ సంస్థ తన LNG ఉత్పత్తిని నిలిపివేసింది. యూరప్, ఆసియా దేశాలకు గ్యాస్ సరఫరా చేసే ఈ ప్లాంట్ మూతపడగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్యాస్ ధరలు ఏకంగా 45 శాతం పైగా పెరిగిపోయాయి.
మార్చి 3న సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో రెండు డ్రోన్లు దౌత్యకార్యాలయం భవనాన్ని తాకడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో తమ దేశ ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. అదేరోజున దుబాయ్‌లో కూడా అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. UAE రక్షణ వ్యవస్థ అనేక డ్రోన్లను అడ్డుకుంది. కానీ డ్రోన్లు లక్ష్యాలు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే సుప్రీం లీడర్ ఖమేనీ రెండో కొడుకైన మోజ్తబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నారు.
హర్మూజ్ జలసంధి మూసివేత
మరోవైపు ఇరాన్.. హర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ ప్రాంతంలో నౌకలు దాటేందుకు యత్నిస్తే దాడులు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచ చమురు రవాణాకు హర్ముజ్ జలసంధి కీలక మార్గంగా ఉంది. ఇక్కడి నుంచే ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం రవాణా చేస్తారు. ఇక భారత్ కూడా ఈ రూట్ నుంచే దాదాపు 50 శాతం చమురు దిగుమతి చేసుకుంటోంది. ఇలాంటి కీలమైన జలసంధిని ఇరాన్ మూసివేయండంతో చమురు ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ ప్రభావం కనిపిస్తోంది.
ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి.. నటాంజ్, కోమ్ సమీపంలోని భూగర్భ అణు కేంద్రాలపై బాంబులతో దాడులు చేశాయి. ఇక మార్చి 4న గగనతలంతో ఇజ్రాయెల్ ఎఫ్-35 విమానం ఇరాన్‌కు చెందిన సుఖోయ్-35 యుద్ధ విమానాన్ని కూల్చేసింది. అంతేకాదు సముద్రంలో కూడా ఇరాన్ నౌకలను అమెరికా తమ టార్పెడోలతో ముంచివేసింది. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై కూడా దాడులు చేసింది. దీనివల్ల వేలాది మంది ప్రజలు సరిహద్దు ప్రాంతాల నుంచి వలస వెళ్లాల్సి వచ్చింది.
మార్చి 5 తెల్లవారుజామున ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడులు చేసింది. ముఖ్యంగా టెల్ అవీవ్‌లోని పలు చోట్ల పేలుళ్లు సంభవించాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం నష్టం జరిగింది. కానీ ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటిదాకా అధికారిక సమాచారం రాలేదు. అలాగే ఇరాన్ దళాలు గల్ఫ్ ప్రాంతంలో అమెరికా జెండాతో ప్రయాణిస్తున్న ఓ చమురు ట్యాంకర్‌పై డ్రోన్ దాడులు చేశాయి. దీంతో హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు దాదాపు 90 శాతం దాకా తగ్గిపోయాయి.
భారీగా ప్రాణనష్టం
ఇక మార్చి 6న ఉదయం ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడులతో నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయిందని స్థానికులు అంటున్నారు. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి లాంచర్లలో దాదాపు 80 శాతానికి పైగా ఇప్పటికే ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇక ఈ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్‌లో 1200 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్‌లో 12 నుంచి 13 మంది మృతి చెందారు. అలాగే అమెరికాకు చెందిన ఆరుగురు సైనికులు మరణించగా మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇక యుద్ధం మరో నాలుగైదు వారాల పాటు ఉంటుందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సీఐఏ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కుర్దీష్ గ్రూపులను వాడుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి ఈ యుద్ధంలో ఇరాన్ లొంగిపోతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Follow Us