India-US Trade Deal: అమెరికా-భారత్ ట్రేడ్ డీల్ లాభమా? నష్టమా?.. 10 ముఖ్యమైన పాయింట్స్ ఇవే!

భారత్‌-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం ఇరుదేశాలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం తర్వాత భారత్‌-అమెరికా మధ్య 10 కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

New Update
10 key takeaways from the India-US interim trade deal

10 key takeaways from the India-US interim trade deal

భారత్‌-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు శనివారం ఇరుదేశాలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటుచేశామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. అమెరికా భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి. గత కొన్ని నెలలుగా ఇరుదేశాలు ఈ ఒప్పందానికి సంబంధించి పలుమార్లు చర్చలు జరిపాయి. ఈ ఒప్పందం తర్వాత భారత్‌-అమెరికా మధ్య 10 కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

1.టారిఫ్‌లు 18 శాతానికి తగ్గింపు 

అమెరికా భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై18 శాతానికి టారిఫ్‌లను తగ్గిస్తుంది. వస్త్రాలు, దుస్తులు, తోలు, పాదరక్షలు, ప్లాస్టిక్, రబ్బరు ఉత్పత్తులు, సేంద్రీయ రసాయనాలు, గృహ అలంకరణ వస్తువులు, హస్తకళా ఉత్పత్తులు, ఎంపిక చేసిన యంత్ర పరికరాలపై టారిఫ్‌లు తగ్గనున్నాయి. మధ్యంతర ఒప్పందం విజయవంతంగా ముగిసిన తర్వాత అమెరికా మరికొన్ని భారతీయ వస్తువలపై టారిఫ్‌లను తొలగిస్తుంది.  జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విడిభాగాలు లాంటి వాటిపై పూర్తిగా సుంకాలను తొలగించనుంది. 

2. అమెరికా వస్తువులపై టారిఫ్‌లు తగ్గింపు 

ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ కూడా అమెరికాకు పెద్దపీట వేసింది. అన్ని రకాల అమెరికా పారిశ్రామిక వస్తువులపై, అనేక రకాల ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై టారిఫ్‌లను రద్దు చేయడం లేదా తగ్గించనుంది. వీటిలో పశుగ్రాసం, పశువుల మేత కోసం ఉపయోగించే ఎర్ర జొన్నలు , ట్రీ నట్స్ (బాదం, అక్రోట్ వంటివి), తాజాగా అలాగే ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ ఆయిల్, వైన్, స్పిరిట్స్ లాంటివి ఇందులో ఉన్నాయి. 

3. భారత వ్యవసాయ రంగానికి రక్షణ

ఈ ఒప్పందం వల్ల భారతీయ రైతులకు ప్రయోజనం చేకూరనుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూశ్ గోయల్ అన్నారు. మొక్కజొన్న, గోధుమలు, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇంధనంగా వాడే ఇథనాల్, పొగాకు, కొన్ని రకాల కూరగాయలు, మాంసం వంటి సున్నితమైన వ్యవసాయ, డైరీ ఉత్పత్తులకు పూర్తి రక్షణ ఉంటుందని తెలిపారు. భారతీయ రైతుల ప్రయోజనాలను, గ్రామీణ జీవనోపాధిని ఈ ఒప్పందం కాపాడుతుందంటూ భరోసా ఇచ్చారు. 

4.  భారత్‌ 500 బిలియన్ డాలర్ల కొనగోళ్లు

వచ్చే ఐదేళ్లలో భారత్‌ అమెరికా నుంచి 500 బిలియన్‌ డాలర్ల (రూ.42 లక్షల కోట్లు) విలువైన వస్తువులను కొనుగోలు చేయనుంది. అమెరికా ఇంధన ఉత్పత్తులు (చమురు, గ్యాస్), విమానాలు, వాటి విడిభాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు,  కోకింగ్ కోల్ (బొగ్గు) కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, మార్కెట్ అవకాశాలను గణనీయంగా పెంచుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

5. రష్యా ఆయిల్‌ ఒప్పందం రద్దు 

భారత్‌.. రష్యా నుంచి చమురును దిగుమతిని నిలిపివేస్తుందని ఇటీవల వైట్‌హౌస్‌ ప్రకటించింది. అమెరికాకు చెందిన ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని , అలాగే రాబోయే 10 ఏళ్లలో అమెరికాతో రక్షణ సహకారాన్ని విస్తరిస్తుందని పేర్కొంది. కానీ భారత్ మాత్రం ఈ ప్రకటనపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇంధన భద్రతను కాపాడుకోవడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మా ఇంధన వనరులను వైవిధ్యీకరించడం తమ వ్యూహంలో భాగమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. 

6. భారతీయులకు విస్తారమైన మార్కెట్ 

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు ముఖ్యంగా MSME, రైతులు, మత్స్యకారులకు $30 ట్రిలియన్ల (సుమారు రూ.2,500 లక్షల కోట్లు) భారీ మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇది మహిళలు, యువతకు లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని చెప్పారు. 

7. ముందస్తు ప్రాధాన్యత

భారత్-అమెరికా కీలక రంగాల్లో ఒకరినొకరు మార్కెట్‌ ప్రవేశాన్ని కల్పించుకునేందుకు కట్టుబడి ఉన్నాయి. గతంలో అమెరికా జాతీయ భద్రత కోసం కొన్ని భారతీయ విమానాలు, విమాన విడిభాగాలపై టారిఫ్‌లు విధించింది. ఇప్పుడు వాటిని తొలగించనుంది. భారత్‌కు కూడా ఆటోమొబైల్ విడిభాగాలపై  ప్రత్యేక రాయితీలు లభించనున్నాయి. జెనరిక్ మందులు, వాటి తయారీకి వాడే ముడిపదార్థాల విషయంలో కూడా సానుకూల ఫలితాలు పొందనుంది. 

8. డిజిటల్, సాంకేతిక ఒప్పందానికి ఊతం

ఇరుదేశాలు డిజిటల్ ఒప్పందంలో ఉన్న అడ్డంకులను పరిష్కరిస్తాయి. GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు), డేటా సెంటర్ వస్తువులతో సహా సాంకేతిక ఉత్పత్తుల వాణిజ్యాన్ని పెంచనున్నాయి. వీటితో పాటు ఉమ్మడి సాంకేతిక సహకారాన్ని మరింత విస్తరించనున్నాయి.

9. మార్కెట్ యాక్సెస్,  నాన్-టారిఫ్ అడ్డంకులకు చెక్

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసేలా ఉండే నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగించేందుకు ఇరు దేశాలు కృషి చేస్తాయి. అమెరికాకు చెందిన వైద్య పరికరాలు, ఐసీటీ (ICT) వస్తువులు, ఆహార, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యంలో ఎంతోకాలంగా ఉన్న అడ్డంకులను పరిష్కరించేందుకు భారత్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు పరిమితంగా ఉన్న దిగుమతి లైసెన్సింగ్ విధానాలను సైతం రద్దు చేయనుంది. అమెరికా ఎగుమతులకు సులభమైన మార్కెట్ ప్రవేశాన్ని కల్పించేందుకు ఆరు నెలల్లోపు నాణ్యతా ప్రమాణాలను సమీక్ష చేయనుంది.

10. వాణిజ్య విస్తరణ

మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు, పూర్తి స్థాయి ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం దిశగా అడుగులు వేసేందుకు ఓ వేదికను సిద్ధం చేస్తుంది. అంటే భవిష్యత్తులో టారిఫ్‌లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు