Ind Vs SA: భారత మహిళల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. దక్షిణాప్రికాతో ఇండియాలో అవుతున్న సీరీస్‌లో మొదటి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ మహిళల జట్టు 265 పరుగులు చేసింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికాను లక్ష్యంలో సగం పరుగులు కూడా చేయనివ్వలేదు. 122 పరుగులకే కుప్పకూల్చింది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా మొదట్లోనే వరుసగా వికెట్లు పడిపోయి కష్టాల్లో పడింది. షెఫాలీ వర్మ (7), హేమలత (12), హర్మన్ ప్రీత్ కౌర్ (10), రోడ్రిగ్స్ (17), రిచా ఘోష్ (3) త్వరగా ఔట్ అయ్యారు. దీంతో 99 పరుగులకే భారత్ ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ స్థితిలో వచ్చిన స్మృతి మంథాన తన బ్యాటింగ్‌తో అద్భుతం చేసింది. స్మృతి మంధాన 127 బంతుల్లో 117 రన్స్ స్కోరు చేసింది. తరువాత వచ్చిన దీప్తి శర్మ (37), పూజ వస్త్రాకర్ (31)లతో కలిపి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పింది. దీంతో భారత జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌత్ ఆఫ్రికా జట్టులో సూనే లూయిస్ (33), మరియన్ కాప్ (24), సినాలో హఫ్తా (27) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో ఆశా శోభన 4 వికెట్లను తీసుకొని దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది. దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా.., రేణుకా సింగ్ ఠాకూర్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు. సెంచరీతో దుమ్ము దులిపిన స్మృతి మంథాన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
Also Read:National: ప్రపంచ ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌పై ట్రయల్ రన్..