చైనాకు, భారతదేశానికి మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు భగ్గుమంటుందని తెలిసిందే. రెండు దేశాల మధ్య అంతటి శతృత్వం ఉంది. రెండు దేశాల మధ్య ఎప్పుడూ ఉద్రిక్తత పరిస్థితులే కనిపిస్తాయి.అలాంటి సరిహద్దులో భారతసైన్యం ఏం చేస్తుంది. మాములుగా అయితే చీమ చిటుక్కుమన్నంత అప్రమత్తంగా ఉంటారు. చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటారు. కానీ మన సైనికులు అక్కడ వ్యవసాయం చేస్తున్నారు.అవును మీరు చదువుతున్నది నిజమే.వ్యవసాయమే చేస్తున్నారు. దీనికోసం చైనా సరిహద్దులో గ్రీన్ హౌజ్ నిర్మించి అందులో కూరగాయలు పండిస్తున్నారు. డీఆర్ డీవో సహాయంతో సైనికులు ఇక్కడ ప్రకతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు.
భారతదేశంతో చైనా తన శతృత్వాన్ని పెంచుకోవాలనే చూస్తుంది. దీనికోసం మన శత్రుదేశాలకు సహాయం చేయడం, ఆయుధాలు సమకూర్చటం చేస్తుంది. భారత సైన్యాన్నికవ్విస్తూ సరిహద్దు ఆక్రమణలకు తెగిస్తుంది. వారి చర్యలను తిప్పి కొట్టడానికి భారత ఆర్మీ నిరంతరం అలర్ట్‌గా ఉంటోంది. అయితే ఇక్కడ విధులు నిర్వహించడం అంతా తేలికైన విషయం కాదు. అరుణాచల్ ప్రదేశ్ పక్కనే ఉన్న చైనాతో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఇక్కడ సైనికులకు ఆహారం అందటం కూడా కష్టమే. ముఖ్యంగా ఇక్కడి హిమలయా దారుల్లో రవాణా అంతా సులువు కాదు. ముఖ్యంగా ఆహార పదార్థాలను చేరవేయటం ఆర్మీకి కష్టసాధ్యం. అందుకే ఇక్కడి సైనికులకు డబ్బాల్లో ఉన్న ఆహారపదార్థాలను మాత్రమే పంపిణీ చేసేవారు. అవి నాణ్యత లేక వాటిని తిన్న సైనికులు తరుచుగా అనారోగ్యానికి గురయ్యేవారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి డీఆర్ డీవో నడుం బిగించింది. 2014లో అసోంలోని తేజ్‌పూర్‌కు చెందిన డీఆర్ డీవో బృందం అరణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలైన తవాంగ్, సలారీలలో గ్రీన్ హౌజ్ లను నిర్మించింది. ఈ గ్రీన్ హౌజ్ లలో వ్యవసాయం చేయడం ఎలాగో శిక్షణ ఇచ్చారు. దీంతో సైనికులే స్వయంగా కూరగాయలు పండిస్తున్నారు. మరోవైపు గేదెలను కూడా పెంచుతున్నారు. ఇప్పుడు సైనికులు మంచి ఆహారం తీసుకోవడానికి, పాలు తాగడానికి అవకాశం ఏర్పడింది. వారు పండించిన కూరగాయలను తాము తినడానికి వాడుకోవడమే కాకుండా స్థానిక ప్రజలకు కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఇక్కడి గ్రీన్ హౌజ్ లలో సైనికులు ముల్లంగి, క్యాబేజీ, టొమాటో, బ్రకోలీతో పాటు దోసకాయలను కూడా పండిస్తున్నారు. అందులోనూ ఎలాంటి పురుగుమందులు వాడకుండా పకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలను సైనికులు తినడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరమవుతున్నారు. మరోవైపు స్థానిక ప్రజలతో సాన్నిహిత్యం పెరగడం వల్ల వారు కూడా సైనికులకు అవసరమైన సహకారం అందిస్తున్నారు.